రాష్ట్రంలో ఎక్కడ చూసిన కల్తీ మద్యం కుటీర పరిశ్రమలే

రాష్ట్రంలోని నలుమూలలకు క‌ల్తీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా

కల్తీ మద్యం కేసును వైయ‌స్ఆర్‌సీపీకి అంటకట్టే ప్రయత్నం 

క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం

క‌ర్నూలు: రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా  క‌ల్తీ మ‌ద్యం త‌యారీ కుటీర ప‌రిశ్ర‌మ‌లు వెలుగు చూస్తున్నాయ‌ని, వీటిని న‌డిపిస్తున్నది టీడీపీ నేత‌లేనంటూ క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌ల్తీ లిక్క‌ర్ త‌యారీని వ్య‌వ‌స్థీకృతం చేశార‌ని  ధ్వ‌జ‌మెత్తారు. గురువారం క‌ర్నూలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో ఎస్వీ మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబు ప్రజారోగ్యాన్ని ప‌ణంగా పెట్టి మ‌రీ క‌ల్తీ లిక్క‌ర్ త‌యారి యూనిట్లు ఏర్పాటు చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టి మ‌రీ సొంత ఆదాయ వ‌న‌రుగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించి టీడీపీ నాయకుల ద్వారా ఈ క‌ల్తీ దందాను న‌డిపిస్తున్నాడ‌ని, బెల్ట్ షాపుల ద్వారా పంపిణీ చేసి ప్ర‌జ‌ల‌తో తాగిస్తున్నాడ‌ని ఆక్షేపించారు. మొల‌క‌ల‌చెరువు క‌ల్తీ లిక్క‌ర్ స్కాంలో ప‌ట్టుబ‌డిన తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జి జ‌య‌చంద్రారెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ కోవ‌ర్టు అని ప్ర‌చారం చేసుకోవ‌డం చంద్ర‌బాబు దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం అన్నారు. సీఎం చంద్ర‌బాబు క‌ల్తీ లిక్క‌ర్‌పై ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ఆ నెపాన్ని వైయ‌స్ఆర్‌సీపీపై నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. 

ప్రభుత్వ పెద్దల క‌నుస‌న్న‌ల్లోనే కల్తీ మద్యం దందా
క‌ల్తీ లిక్క‌ర్ దందాలో ప‌ట్టుబ‌డుతున్న నిందితులంతా టీడీపీ నాయ‌కులేన‌ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి తెలిపారు. తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జి జ‌య‌చంద్రారెడ్డి అడ్డంగా దొరికిపోయాక వైయ‌స్ఆర్‌సీపీ కోవ‌ర్టు అని ప్ర‌చారం చేసుకుంటున్నందుకు టీడీపీ సిగ్గుప‌డాల‌న్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద టీడీపీ టికెట్ మీద‌ పోటీ చేసిన వ్య‌క్తినే పెద్దిరెడ్డి అనుచ‌రుడ‌ని దిగ‌జారిపోయి ప్ర‌చారం చేసుకోవ‌డమే చంద్ర‌బాబు విజ‌న‌రీయా? అని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలోనే క‌ల్తీ లిక్క‌ర్ దందా సాగుతుంద‌ని చెప్ప‌డానికి అరెస్టు అవుతున్న టీడీపీ నాయ‌కులే సాక్ష్యమ‌న్నారు. టీడీపీలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిలే అరెస్ట్ అవుతుంటే ఇంత‌క‌న్నా వేరే ఆధారాలు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో క‌ల్తీ లిక్క‌ర్ మ‌ర‌ణాలు సంభవించ‌క‌పోయినా జ‌రిగిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష ప్ర‌చారం చేశాడు. కానీ నేడు కూట‌మి పాల‌న‌లో టీడీపీ నాయ‌కులే అధికారికంగా ఇంత దారుణంగా ప్ర‌జారోగ్యాన్ని ప‌ణంగా పెట్టి మ‌రీ క‌ల్తీ లిక్క‌ర్ త‌యారు చేసి దోచుకుంటుంటే నోరెత్తకుండా హైద‌రాబాద్‌లో తిరుగుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడూ రాష్ట్రంలో అందుబాటులో ఉండ‌టం లేద‌ని కూట‌మి ఎమ్మెల్యేలే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. క‌ల్తీ మ‌ద్యం తాగి నెల్లూరులో నలుగురు, ఇబ్ర‌హీంపట్నం మండ‌లం చిలుకూరులో ఒక‌రు, కాలేశ్వ‌ర గ్రామంలో ఒక‌రు, గుంత‌క‌ల్లులో బేల్దారి మేస్త్రీ చ‌నిపోయారు. క‌ల్తీ లిక్క‌ర్ తాగి చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్, చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెబుతారు?  కూట‌మి నాయ‌కుల ధ‌న దాహానికి రాష్ట్రంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యమైపోయాయ‌ని ఆక్షేపించారు. 

వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై మద్యం స్కాం అంటూ తప్పుడు కేసులు పెట్టార‌ని,  రానున్న రోజుల్లో వాటికి బదులు చెల్లిస్తామ‌న్నారు. త్వరలో సాక్షాధారాలతో బయట పడుతాయ‌ని ఎస్వీ మోహ‌న్‌రెడ్డి పేర్కొన్ఆన‌రు. గ‌త ప్ర‌భుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తే , కూటమి ప్రభుత్వం మాత్రం మద్యాన్ని డోర్ డెలివరీ చేయిస్తుంద‌ని విమ‌ర్శించారు.  కల్తీ మద్యాన్ని , బెల్ట్ షాపులను నియంత్రించకపోతే మహిళలతో కలిసి పోరాటాన్ని ఉదృత్తం చేస్తామ‌ని ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చ‌రించారు. 

Back to Top