కర్నూలు: తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఆశ్చర్యం కలిగించే విషయం కాదని వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర మేయర్ బీ.వై. రామయ్య అన్నారు. ఆది నుంచి వారిద్దరూ ఒకటే అన్నట్లుగా తాము చూశామని, అదే విషయాన్ని ప్రజలకి చెప్పామన్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా వ్యక్తి గురించి ఎల్లో మీడియా తెగ చర్చ పెడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆయనకు ప్రజాబలం ఏముందని ప్రశ్నించారు. జనసేనకు అజెండా అంటూ ఏం లేదని, జెండా చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్‌కు తెలుసని బి.వై. రామయ్య దుయ్యబట్టారు. వైయస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో, పుష్కరాల్లో, రాజధాని నిర్మాణంలో ఇలా ఏ కీలక సమయంలోనైనా నటులను వాడుకోవడం చంద్రబాబుకు బాగా ఇష్టమని బి.వై. రామయ్య తెలిపారు. అదే కోవలో పవన్‌ను కూడా రాజకీయాల్లో చంద్రబాబు బాగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో బలమైన నాయకులమనేవారు 2014 విరివిగా పోటీచేస్తే టిడిపికి మూడు సీట్లు వచ్చాయని, వారిద్దరూ కలిసి 2019 పోటీ చేస్తే ఒక్క సీటు రాలేదన్నారు. అప్రజాస్వామిక కలయికను ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోరన్నారు. అదే తరహాలో గత ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆనాడు వ్యతిరేక ఓట్లు చీల్చి బాబుకు లబ్ది చేకూర్చి, నేడు అంతోఇంతో ఉన్నా వ్యతిరేక ఓట్లు చీలి బాబుకు నష్టం వాటిల్లకుండా పవన్ ముసుగు తొలగించారన్నారు. ఆ కలయిక అప్రజాస్వామికమని బీ.వై. రామయ్య మండిపడ్డారు. రాజకీయాల్లో పవన్‌కి పాత్రలెన్నో.. సినిమాలో హీరోగా మాత్రమే నటించే పవన్ కళ్యాణ్‌కి రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు చాలా పాత్రలు పోషించేలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014కు ముందు మిత్రపక్ష పాత్ర, తర్వాత విపక్ష పాత్ర, 2019 తర్వాత మళ్ళీ మిత్రపక్ష పాత్ర ఇచ్చారని, ప్రస్తుతం చంద్రబాబు కేసుల నుంచి బయట పడేందుకు బిజెపితో దగ్గరయ్యేందుకు పవన్‌కు రాయబార పాత్రను చంద్రబాబు అప్పజెప్పారన్నారు. బిజెపి కలిసి వస్తే బాగుంటుందని పవన్ అనడం బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. అవసరాన్ని బట్టి ఎవర్ని ఎలా వాడాలో చంద్రబాబుకు తెలుసని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. చట్టమంటే చంద్రబాబుకు గౌరవం లేదు.. నాడు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనపై కేసులుంటే కోర్టుకు వెళ్ళాల్సిన రోజు వెళ్లి చట్టాన్ని గౌరవించారన్నారు. చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా, అరెస్టు సమయంలో అల్లర్లు జరిగాలని రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం, తర్వాత తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం చేశారని మండిపడ్డారు. కర్నూలులో జరుగుతున్న దీక్షలో ఐదారు మంది కూడా లేరని, సోమవారం చేపట్టిన బంద్ కూడా విఫలమైందన్నారు. అవినీతి సొమ్ము సంపాదించి అండగా నిలవాలని చంద్రబాబు కోరడంపై తమకు నచ్చడం లేదని తనకు టిడిపి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారన్నారు. పొత్తులకు సందర్భం దొరకదా? చంద్రబాబుకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల తప్ప మరే మంచి ఉద్దేశం ఉండదన్నారు. పొత్తుకు సమయం, సందర్భం ఆయన పట్టించుకోడనేది మరోసారి నిరూపితమైందని బీ.వై. రామయ్య పేర్కొన్నారు. నాడు హరికృష్ణ శవం దగ్గర కెటిఆర్‌తో పొత్తు గురించి మాట్లడిన చంద్రబాబు, నేడు పరామర్శకు వెళ్ళినా పవన్‌తో పొత్తు గురించి చర్చించడం సిగ్గుచేటన్నారు. కేంద్రంపై కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలా? చంద్రబాబు అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలపై మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వంపై టిడిపి నేతలు అభాండాలు వేయడం సరైనది కాదని బీ.వై. రామయ్య హెచ్చరించారు. దమ్ముంటే పొత్తుకు పాకులాడకుండా బిజెపిపై పోరాడాలని సూచించారు. కేసులకు లాలూచీ పడి దిగజారుడు రాజకీయాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారనేది టిడిపి నేతలు గుర్తించుకోవాలన్నారు. జిల్లాలో వైయస్ఆర్ సీపీకి తిరుగులేదు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్నూలు జిల్లాలో తిరుగులేదని బీ.వై. రామయ్య ధీమా వ్యక్తంచేశారు. టిడిపి, జనసేన పొత్తు ప్రభావం జిల్లాలో ఏమాత్రం లేదన్నారు. మళ్ళీ ఉమ్మడి కర్నూలు జిల్లాను క్వీన్ స్వీప్ చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధే తమ ఆయుధాలని వెల్లడించారు.