విజయవాడ: ఆహారశుద్ధి అభివృద్ధికి క్లస్టర్ విధానం ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి సంబంధిత అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుందని తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధితో పాటు గ్రామీణ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు చేశారని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెంచుతూ, ఆహార ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చేలా నూతన విధానాన్ని రూపొందించాలని అధికారులను కోరారు. ఆహార శుద్ది పరిశ్రమల అభివృద్ది, విధాన రూపకల్పన, అమలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వ కార్యాచరణను మంత్రి అధికారులకు వివరించారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ పాలసీ తయారీలో నాబార్డు వారి విధానాలు, ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ఆహారశుద్ధి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం వుందన్నారు. అందుకు తగిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఫుడ్ ప్రాసెస్సింగ్ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, కేపీఎంజీ కన్సల్టెంట్స్‌లు పాల్గొన్నారు. .