తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ ప్రభంజనం సృష్టించనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయస్సార్‌సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారింది. దీనికి తోడు రోజు రోజుకు వైయస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి మద్దతు వెల్లువెత్తుతోంది. మంగళవారం వివిధ కుల సంఘాల నాయకులు వైయస్ఆర్‌సీపీకి మద్దతు తెలిపారు. ఈక్రమంలో ‘స్థానిక’ ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టమవుతోంది. రెండో స్థానం నిలబెట్టుకునేందుకే టీడీపీ తంటాలు పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైయస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజలు వారిని ఆదరించడం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా..పట్టించుకోవడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును వైయస్ఆర్ సీపీనే కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో మరింత మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తోంది. గురుమూర్తి ప్రచారానికి విశేష స్పందన డాక్టర్ గురుమూర్తి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీనికి తోడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మొత్తం 16,50,453 ఓట్లలో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది. అందులో 55శాతం 7,22,877 ఓట్లు వైయస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 37శాతంతో 4,94,501 ఓట్లు సాధించారు. దీంతో వైయస్సార్‌సీపీ 2,28,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో వైయస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. భారీ మెజారిటీ ఖాయం వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పనితీరు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయి అని టీటీడీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ జిల్లా ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డి గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు నోరూపారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఈ ఉపఎన్నికల్లో తిరుపతి ప్రజలే తమ ఓటు ద్వారా తేలుస్తారని అన్నారు.