పశ్చిమ గోదావరి : వెన్నుపోటు పొడిచారు.. మోసం చేశారు.. అనే అర్హత చంద్రబాబుకు లేదని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వెన్నుపోటు దారుడుకు అర్హత గల వ్యక్తి చంద్రబాబు మాత్రమే. వెన్నుపోటు పొడిచే విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు. మంగళవారం నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం.. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఊడగొట్టిన మంచం కోడిలా ఎక్కడో తెలంగాణలో ఉంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాను అనడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిభ్రమించింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదు. సీఎం వైయస్ జగన్ భారత రాజ్యాంగానికి లోబడే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్వార్ధంతో కాదని ముందుగా గమనించాలి. మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ ఎవరిని మభ్య పెట్టలేదు.. బహిరంగంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. దమ్ముంటే మీరు రాజీనామా చేయాలి.. రాజీనామాలు చేయండని మాకు చెప్పడం కాదు.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచి అప్పుడు చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని సుబ్బారాయుడు హెచ్చరించారు. మూడు రాజధానులు విషయంలో ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు వల్ల రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుందని కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడించారు.