ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు

మంత్రి కొడాలి నాని

విజ‌య‌వాడ‌: రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలన్నీ కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒకరీతిన ఆటంకాలు సృష్టించటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో ‘ఓటీఎస్‌’ పథకాన్ని తీసుకొస్తే, దీనిపైన కూడా దుష్ప్రచారం చేయటం ప్రతిపక్షాల దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఇళ్లపై యజమానులకు హక్కులు కల్పించాలనేదే ఓటీఎస్‌ ప్రధాన ఉద్దేశమన్నారు.

ఏబీఎన్, టీవీ 5, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పచ్చమీడియా రోజూ రాష్ట్రంలో ఏదో అయిపోతోందనే అభూత కల్పనలు అల్లి జనంపై పడుతున్నాయని చెప్పారు. ఉన్నది ఉన్నట్లు  ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందని, ఇలావంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన మాట మేరకు జనవరి నుంచి పింఛన్‌ రూ.2,500కు పెంచి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మేలుచేసి, వారి మన్ననలు చూరగొని మళ్లీ అధికారంలోకి రావాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశమని మంత్రి నాని చెప్పారు.  

తాజా వీడియోలు

Back to Top