చంద్రబాబు శవ రాజకీయాలు

సాంబిరెడ్డి మరణానికి, ఉల్లికి సంబంధం లేదు..

మంత్రి కొడాలి నాని  

గుడివాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడ రైతు బజార్‌లో గుండెపోటుతో మరణించిన సాంబిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం ఉదయం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాంబిరెడ్డి మరణానికి, ఉల్లిపాయలకు సంబంధం లేదని.. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఉల్లిపాయలు కోసమే వెళ్ళి మరణించారని చెప్పాలని సాంబిరెడ్డి కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ విషయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సాంబిరెడ్డి కుటుంబం అర్థికంగా ఉన్నత స్థితి లో ఉందని, సాంబిరెడ్డి ఆర్టీసీలో కండక్టర్ పని చేశారని, గతంలో గుండెపోటు రావడంతో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని వివరించారు.

 సాంబిరెడ్డికి క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం 
ఆయన ఇద్దరు కుమారులు హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లని,  గుడివాడలో మూడు అంతస్తుల భవనం నిర్మించుకొని ,15 ఎకరాలు వ్యవసాయ చేసుకుంటున్న సాంబిరెడ్డి.. 25 రూపాయల కిలో ఉల్లిపాయలు కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం శాసనసభలో చంద్రబాబు.. మృతి చెందిన సాంబిరెడ్డి ఫొటోను అసెంబ్లీలో ప్రదర్శించి గగ్గోలు పెట్టారన్నారు. ఉల్లిపాయల కోసం సాంబిరెడ్డి క్యూలెన్లలో నిలబడి తొక్కిసలాటలో మరణించలేదని.. గుండెపోటుతోనే మరణించారని స్వయంగా ఆయన కుటుంబసభ్యులు చెప్పిన కూడా వినకుండా చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు మరణిస్తారా అని శవాలు కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా ప్రకటన చేయడం దిగజారుడుతనమన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఆధారంగా రాజకీయాలు చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈది నట్లేనని  కొడాలి నానిఎద్దేవా చేశారు.

Read Also: రాజ‌ధాని విష‌యంలో నా వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారు

Back to Top