బడుగులు, బీసీల పట్ల  వివక్ష, ద్వేషంతో చంద్ర‌బాబు 

రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

తణుకు : బడుగు, బలహీనవర్గాల పట్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ నాయకులు వివక్ష, ద్వేష భావాలను వదలకపోతే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న 23 సీట్లలో 3 కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీల తోకలు కట్‌ చేస్తానని హేళన చేశారని, ఇప్పటికీ మారని ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.

మంత్రి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తే బడుగు, బలహీన వర్గాలపై ఆ పార్టీ ఎంత ద్వేషంతో ఉందో అర్థమవుతుందని చెప్పారు. యూకే నుంచి తెప్పించిన మార్ఫింగ్‌ చేసిన వీడియోతో టీడీపీ నాయకుల దుష్ప్రచారం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో మహిళలు, బడుగు బలహీన వర్గాల పట్ల టీడీపీ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు.

ఆడవారిని ఏ విధంగా అవమానిస్తారో, ఎన్టీఆర్‌ను జయప్రదంగా పార్టీ నుంచి ఎలా వెళ్లగొట్టారో అందరికీ తెలుసని చెప్పారు. గోరంట్ల మాధవ్, నందిగం సురేష్‌లను అప్పటి టీడీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందని, వాటిని తట్టుకుని పోరాడి 2019 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచి పార్లమెంట్‌లో ప్రవేశించారని చెప్పారు. వారిని ఎదుర్కోలేక బూతు పురాణంతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.  

Back to Top