పారదర్శకంగా సంక్షేమాన్ని అందించేందుకు సచివాలయ వ్యవస్థ 

 మంత్రి కారుమూరి

తణుకు : ప్రజలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పరచారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి క్యాంపు కార్యాలయంలో తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఓకేసారి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశచరిత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో దానికి కట్టుబడి ఉద్యోగులంతా ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. 

సీఎం వైయ‌స్ జగన్‌కు రుణపడి ఉంటాం
పీజీలు చేసి ఈ చెత్త ఉద్యోగాలే దిక్కా అని కొందరు.. మీ ఉద్యోగాలు నీటి బుడగలే అంటూ ఇంకొందరు తమను విమర్శించారని, వీటికి చెక్‌ చెబుతూ చెప్పాడంటే చేస్తాడంతే అనే రీతిలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారని సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలు మారిపోయాయంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్, మంత్రి కారుమూరికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి కారుమూరి కేక్‌ కట్‌ చేసి వారందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ దాట్ల సుందరరామరాజు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మెహర్‌ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, మునిసిపాలిటీ పరిధిలోని సెక్రటరీలు పాల్గొన్నారు.

Back to Top