విజయవాడ: రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చాడని.. ఇప్పుడు డబ్బున్న వాళ్ళను మాత్రమే జనసేన నాయకుల్ని చేస్తోందని వైయస్ఆర్‌సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ విమర్శించారు. పార్టీ పెట్టి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశారని విమర్శించారు.సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలే చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరి నుంచి పవన్ కల్యాణ్ కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నాడు. పవన్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడు. 2019 తరువాత చార్టర్ ఫ్లైట్ కొన్నాడు. కోట్లు పెట్టి కార్లు కొన్నాడు. అసలు పవన్‌కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?.. నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డున పడేశారు. టీడీపీకి హోల్ సేల్ గా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడు. నమ్మి మోసపోయిన నాకు మీరు(పవన్‌ను ఉద్దేశించి..) సమాధానం చెప్పాలి అని రామ్‌సుధీర్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాల పేరుతో పెద్ద స్కామ్‌కు తెరలేపారు. జనసేనలో నాదెండ్ల, లింగమనేని ఇద్దరూ కలిసి టికెట్ల డిసైడ్ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు.. అని రామ్ సుధీర్ ఆరోపించారు.