అందుకే మా మద్ధతు...

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉందని వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉన్నందునే ఈ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని 239ఏఏ అధికరణం కింద పేర్కొన్న మూడు సబ్ క్లాజ్లు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారం పార్లమెంట్‌కు కట్టబెట్టిందని అన్నారు. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించి పార్లమెంట్‌ చట్టాలు చేయవచ్చున్నా అన్న అంశంపై సుప్రీం కోర్టు జారీ చేసిన విస్పష్టమైన ఆదేశాలను ఆయన ఉదహరిస్తూ సర్వీసులపై సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉండేలా చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. ఇది నిర్వివాదమైన అంశం. న్యాయపరంగా కూడా ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని ఆయన అన్నారు.
సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు పార్లమెంట్‌ పరిమితులు విధించ వచ్చునా అన్న అంశంపై కూడా సుప్రీం కోర్టు వివరణ స్తూ రాజ్యాంగం లేదా పార్లమెంట్‌లో చేసిన చట్టం కింద కేంద్ర ప్రభుత్వానికి దఖలుపడిన అధికారం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ అధికారాలకు పరిమితులను విధించవచ్చని స్పష్టం చేసినట్లు శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 239ఏఏ అధికారణ కింద్ర పేర్కొన్న క్లాజ్‌లను, సుప్రీం కోర్టు ఆదేశాలను కలిపి పరిశీలిస్తే ఢిల్లీ బిల్లుకు పూర్తి చట్టబద్దత ఉన్నట్లేనని అన్నారు. ఢిల్లీ దేశ రాజధాని అయినందున ఇది దేశంలోని ప్రతి ఒక్కరికి చెందుతుంది. అందువలన దీనిపై తీసుకునే ఏ నిర్ణయం అయినా కేవలం ఢిల్లీ వాసులపైనే కాకుండా యావత్తు దేశ ప్రజానీకంపై ప్రభావం చూపుతుందని అన్నారు.
ఈ బిల్లుపై అనవసరమైన వివాదం ముసురుకుంది. కొన్ని విపక్షాలు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈ బిల్లును వివాదాస్పదం చేశాయని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నందుకు ఆప్‌ సభ్యుడు శ్రీ రాఘవ్‌ చద్దా తమతోపాటు ఎన్డీయేతర పక్షాలను వేలెత్తి చూపడం పట్ల ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. 'ఇంటికి నిప్పు అంటుకుంటే తగలబడిపోయేది నా ఒక్కడి ఇల్లే కాదు. పొరుగున ఉండే చాలా ఇళ్ళకు ఆ నిప్పు అంటుకుంది' అంటూ తమను ఉద్దేశించి ఆప్‌ సభ్యుడు చేసిన వ్యాఖ్యకు శ్రీ విజయసాయి రెడ్డి కౌంటర్ వేస్తూ ఇంధనం లేకుండా మంట రాజుకోదు. ఢిల్లీలో మంటలు రాజేస్తున్న డర్టీ పాలిటిక్స్‌ చేసున్నదెవరో మా అందరికీ బాగా తెలుసు. ఆప్‌ సభ్యుడికి నేనిచ్చే సలహా ఒక్కటే నిప్పుతో చెలగాటం అడితే అది నిన్ను దహిస్తుంది అని చురకలు అంటించారు. ఈ బిల్లు పాసైతే ఆమ్‌ ఆద్మీ పార్టీ కాస్త అబ్సల్యూట్‌ అనార్కీ పార్టీ (ఆప్‌) అవుతుంది. తానాషాహీ పార్టీ తమ స్వార్ధ ప్రయోజనాలకు ఢిల్లీని వాడుకోజాలదని అన్నారు. ఎవరో ఒత్తిడి చేయడం వలనో నిర్బంధంగానో మేము ఈ బిల్లుకు మద్దతు తెలపడం లేదు. నీతిలేని పాలన నుంచి ఢిల్లీని రక్షించడానికే మేం ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఎన్నికల ఖర్చులు కోసం వేర్పాటువాదులను సమర్ధించి వారి నుంచి విరాళాలు వసూలు చేశారని ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ గతంలో చేసిన ఆరోపణలను శ్రీ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు...వేర్పాటువాద ఉద్యమాన్ని బలపరచడానికా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటానికా తెలుసుకోవాలని ఉందని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ వ్యవస్థాపక సభ్యులైన శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్, అశుతోష్ వంటి వారు ఆ పార్టీని ఎందుకు వీడారో కూడా నాలాగే చాలా మంది సభ్యులు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఈ బిల్లు రాజకీయంగా సరైనదా కాదా అన్నది చర్చించడానికి ఇక్కడ లేము. రాజ్యాంగపరంగా, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి ఉందా లేదా అన్నదే ప్రధానం. ఈ రెండు అంశాల్లోను బిల్లు చట్టబద్దంగానే ఉందని, అందుకే ఈ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందని  విజయసాయి రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top