జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసా రాజకీయాలకు పోలీసులు సహకరించడం దుర్మార్గం

ఆయన దౌర్జన్యాలపై పోరాటం చేస్తాం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు శృతిమించాయని వైయ‌స్ఆర్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. గూండాలను వెంటపెట్టుకుని దాదాపు 50 వాహనాల్లో తిరుగుతూ వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్ల వద్ద దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని నిలదీశారు. ఒక రాజకీయ నాయకుడు పెద్ద సంఖ్యలో వాహనాలు, అనుచరులతో తిరుగుతుంటే పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసా రాజకీయాలకు పోలీసులు సహకరించడం దుర్మార్గమని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించి తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యాలను చూస్తూ ఊరుకునేది లేదని, వాటిపై వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోరాటం చేస్తామని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top