వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అక్రమ కేసు

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ ఆయనతో పాటు 15 మందిపై కేసు 

నరసరావుపేట: గుడ్‌ మార్నింగ్‌ నరసరావుపేట పేరిట వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తలపెట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకో­వాలనే కుట్రతో తప్పుడు కేసులను బనాయించింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుడ్‌ మార్నింగ్‌ నరసరావుపేట పేరిట నెల రోజులుగా కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజు ఉదయం ప్రజలతో మమేకమవుతున్నారు. 

ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. దీన్ని ఓర్వలేక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌ బాబు ప్రోద్బలంతో ఇప్పటికే అధికారులు అనేక అడ్డంకులు సృష్టించారు. కార్యక్రమం నిర్వహించరాదంటూ గోపిరెడ్డికి నోటీసులిచ్చారు. అయినప్పటికీ గోపిరెడ్డి ముందుకు సాగారు. అదివారం ఎమ్మెల్యే అరవింద్‌ బాబు నివాసముండే ప్రకాష్ నగర్‌ రిక్షాసెంటర్‌కు వెళ్లి గుడ్‌మార్నింగ్‌ నరసరావుపేట కార్యక్రమాన్ని గోపిరెడ్డి నిర్వహించారు.

ఆ సమయంలో మైనార్టీ నేత, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్‌ నాగూర్‌ వలీ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి గోపిరెడ్డి ముందుకు సాగారు. కేక్‌ కటింగ్‌ రెండు మూడు నిమిషాల్లోనే ముగిసింది. ఈ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందన్న సాకుతో టీడీపీ సానుభూతిపరులైన ఆటో డ్రైవర్‌తో గోపిరెడ్డిపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని నాగూర్‌తోపాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో 14 మందిపై నరసరావుపేట వన్‌ టౌన్‌ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా పుట్టిన రోజు నాడు నాగూర్‌ను ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి చివరకు పూచీకత్తుపై పంపారు. 

Back to Top