చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను

చేయగలిగింది చెబుతా.. కచ్చితంగా చేసి తీరుతా

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తీర్చుతున్నాం

మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అబద్ధాలతో ఊదరగొట్టింది. మన రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు సాధించామని అన్నీ అబద్ధాలు మాట్లాడింది. చంద్రబాబులా నేను అబద్ధాలు చెప్పలేను.. పారిశ్రామిక వేత్తలకు నేను ఇచ్చే గ్యారంటీ నిజాయితీ, నిబద్ధత అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘మనపాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన మేధోమథన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వ మోసాలను వివరించారు. 

‘గత ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఒక రోజు.. నెలకో విదేశీ పర్యటనల హడావిడి చేసింది. రూ.50 వేల కోట్లతో సెమీకండక్టర్‌ పార్కును నెక్ట్‌ హార్బిట్‌ ఏర్పాటు చేస్తుందని ఒక రోజు.. ఎయిర్‌బస్‌ వచ్చేస్తుందని, మైక్రోసాఫ్ట్‌ వచ్చేస్తుందని, బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేస్తుందని, హైపర్‌లూప్‌ వచ్చేస్తుందని ఊదరగొట్టారు. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో దివాళా తీసిన బీ.ఆర్‌.శెట్టి.. ఈ పక్కనే 1500 పడకల ఆస్పత్రి కోసం రూ. 6 వేల కోట్లతో దిగుతున్నాడని ఇలాంటి అబద్ధాలు, గ్రాఫిక్స్‌ చూపించారు.

ఇలాంటి మాటలు నేను కూడా చెప్పడం మొదలుపెడితే ఎక్కడా న్యాయం అనేది ఉండదు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటూ గొప్పగా గత ప్రభుత్వం వాళ్ల అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకుంది. టాప్‌ 1, 2, 3 స్థానంలో మన రాష్ట్రం ఉందని గొప్పగా చెప్పుకునేవారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే ఏంటో నిజంగా నాకు అర్థం కాలేదు. 

గత ప్రభుత్వం 2014–19 వరకు ఇండస్ట్రీయల్‌ రాయితీలు ఇస్తామని చెప్పిందో.. ఆ మాట మీద పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెడితే.. వాళ్లకు ఇవ్వాల్సిన రాయితీలు 2014 నుంచి 19వరకు ఎన్ని ఉన్నాయని లెక్క తీస్తే దాదాపు రూ.4 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు. దీంట్లో రూ.968 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు సంబంధించినవి. రాయితీలు ఇస్తామని చెప్పి.. పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ రాయితీలు ఇవ్వకుండా.. మన రాష్ట్రంలో చాలా బాగుందని ఎలా చెప్పగలం.?

ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే.. డిస్కమ్‌లకు ఎంత అప్పులు ఉన్నాయని చూస్తే.. పవర్‌ ప్రొడ్యుసర్స్‌ దగ్గర నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు రూ.20 వేల కోట్ల బకాయిలు పెట్టింది. డిస్కమ్‌లకు సప్లయ్‌ చేసిన కరెంట్‌కు బిల్స్‌ పే చేయడం మానేసింది. గత ప్రభుత్వం మీడియాను అడ్డంపెట్టుకొని గొప్పలు చెప్పుకుంది. అందరూ ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటారు.. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దావోస్‌కు.. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలకు వెళ్లి అబద్ధాలు చెప్పినవే చెప్పి.. వాళ్లకు అనుకూలంగా ఉన్న మీడియాతో ప్రచారం చేయించుకున్నారు. 

ఇలాంటివన్నీ నేను చెప్పలేను.. నేను ఏం చేస్తున్నాను.. ఈ ఏడాదిలో ఏం చేయగలిగానని నిజాయితీగా చెప్పగలను. పారిశ్రామిక వేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక్క గ్యారెంటీ ఏంటంటే.. నిబద్ధత, నిజాయితీ. ఇవి మాలో ఉన్నాయి. ఏదైతే చెబుతామో.. వాటిని కచ్చితంగా చేసి తీరుతాం’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top