శ్రీకాకుళం: హుద్ హుద్ తుపాను బాధితులకు రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక క్యాంప్ ఆఫీసులో కుందువాని పేటకు చెందిన 72 మంది లబ్ధిదారులకు వీటిని అందించారు. ఇళ్లు లేని వారికి ప్రాధాన్యం ఇస్తూ వీటిని అందిస్తామని మంత్రి ధర్మాన తెలిపారు. ఇప్పటికీ ఇళ్లే లేని పేదలు ఉన్నారని, వారిని ఆదుకున్నామని, ఇప్పటికే ముప్పై లక్షల మందికి స్థలాలు ఇచ్చాం అని తెలిపారు. అందులో పదిహేను లక్షల ఇళ్లను కిందటి సారి మంజూరు చేశామని, ఈ సారి మరో పదిహేను లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం అని వివరించారు. అదేవిధంగా పేదలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా బడి ఈడు పిల్లలు క్రమం తప్పకుండా బడికి పంపేందుకు, పేదరికం రీత్యా చదువులు మధ్యలోనే ఆపేయకుండా ఉండేందుకు తల్లుల అకౌంట్లలోకి పదిహేను రూపాయలు అమ్మ ఒడి పేరిట అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా పిల్లలకు పుస్తకాలు., స్కూల్ బ్యాగ్, షూస్ తో పాటు వాళ్లకు మంచి గా బోధించేందుకు మంచి సౌకర్యాలతో తరగతి గదులు ఇలా అన్నీ కల్పించి, భావి తరాలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అంగన్ వాడీలు మొదలుకుని మత్స్యకారుల వరకూ తమ ప్రభుత్వం అన్ని వర్గాలనూ ఆదుకుంటుందని వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నామని, ఇదంతా మార్పేనని, ఇదంతా తమ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం అని అన్నారు. ధరల విషయమై విపక్షాల విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పొరుగు, ఇతర రాష్ట్రాలతో పోల్చి ధరల విషయమై మాట్లాడాలని, అసత్య ప్రచారం చేసి అపోహలు సృష్టించేవారిని నమ్మవద్దని హితవు చెప్పారు. కరోనా సమయంలో ప్రజలు ఆకలితో అలమంటించకుండా నిత్యావసర సరకులు అందించామని గుర్తు చేశారు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కడుతున్నాం అని, ఇది పూర్తయితే ఇకపై మత్స్యకారులు పనుల నిమిత్తం, ఉపాధి నిమిత్తం, వేట నిమిత్తం ఇకపై గుజరాత్ కు పోవాల్సిన పనే ఉండదని అన్నారు.

గూనపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం
శ్రీకాకుళం : స్థానిక గూనపాలెం సచివాలయం పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నిర్వహించారు. స్థానిక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వాటి పై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయనేమన్నారంటే..
- ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని శ్రద్ధతో చేస్తున్నందుకు మీ అందరికీ ముందుగా నా అభినందనలు.
- ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు, స్థానిక సమస్యలు గుర్తించేందుకు ఓ చక్కని అవకాశంగా దీనిని మలుచుకోవడం.
- అధికారంలోకి రాక మునుపు చెప్పినటువంటి మాటలు కానీ హామీలు కానీ ప్రకటించిన పథకాలు కానీ అవన్నీ క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్నాయో లేదో అన్నది తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమం ఇది.
- పథకాల అమలులో లోపాలు ఏమయినా ఉన్నాయా, లేకా ఇంకా ఏమయినా చేయాల్సినవి ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకే ఈ గడప గడపకూ మన ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. వీటిని అమలు చేస్తున్న క్రమంలో ఎక్కడయినా అవినీతి, అక్రమాలు ఏమయినా చోటు చేసుకున్నాయా, అదేవిధంగా పథకాలు అందుకున్న వారితోనే మాట్లాడి, అవి ఏ విధంగా వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి అన్నవి తెలుసుకునేందుకు ఈ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యోద్దేశం.
- ఇది ఒక్క వార్డుకు పరిమితం అయిన కార్యక్రమం కాదు ఇది మన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రతి సెక్రటేరియట్ పరిధిలో రెండు రోజుల పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం పని తీరు ఏ విధంగా ఉంది..వారికి ప్రభుత్వ పనితీరుపై ఉన్న అభిప్రాయం ఏంటి ? ఇలాంటివెన్నో గుర్తించాల్సిన సందర్భం ఇది. అందుకే ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని ఎవ్వరైనా అన్నారా లేదా మాకు డబ్బులు అందడం లేదని ఎవ్వరైనా అన్నారా ? అంతేకాదు ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేయమని కోరడం తప్పేం కాదు. అలాంటివి ఏమయినా ఉంటే మనం సరిదిద్దుకోవాలి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలోనూ నిర్వహిస్తాం. మీరంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను.
- రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ సేపు తాగు నీరు అందించిన వైనం ఎక్కడా లేదు. ఇంత ఎక్కువ సేపు తాగునీటి సరఫరా చేస్తున్న ఘనత ఇక్కడి అధికారులకు చెందుతుంది. నిజంగా ఇటువంటి వ్యవస్థ మరే ఇతర కార్పొరేషన్లకూ లేదు. అదేవిధంగా చెత్త పన్నుకు సంబంధించి కొంత అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా తగదు. ఇవాళ శానిటేషన్ ప్రక్రియ అన్నది చాలా బాగా నిర్వహిస్తున్నాం. నగరంలో ఇంటింటికీ వాహనాలు తిప్పుతూ చెత్త సేకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు చెత్త కుప్పలు తొలగింపజేస్తున్నాం. కానీ విపక్షం మాత్రం బాదుడో బాదుడు అని అంటోంది.
- కార్పొరేషన్ పరిధిలో అసహ్యంగా ఉన్న ప్రాంతం ఒక్కటి చూపండి. పారిశుద్ధ్య నిర్వహణ అన్నది మనమందరం కలిసే చేస్తున్నాం. ఇది మనకు గౌరవం కాదా అని అడుగుతున్నాను. ఇందుకు సంబంధించి ఇంతవరకూ ఒక కంప్లైంట్ రాలేదు.
- అదేవిధంగా రిమ్స్ ఆస్పత్రిని ఎంతగానో అభివృద్ధి చేశాం. ఎక్కడో హైద్రాబాద్ లో ఉండి చంద్రబాబు (విపక్ష నేత) మాట్లాడడం కాదు క్షేత్ర స్థాయిలో తిరిగి వాస్తవాలు గుర్తించాలి. ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ రోజు ఏం చెప్పామో అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం గొప్పదనమా అంటే కాదు బాధ్యత. బాధ్యత కనుక తప్పక నిర్వర్తించి మంచి ఫలితాలు ప్రజలందరికీ అందేలా చేస్తున్నాం. పంచాయతీల విలీనం (నగర శివారున ఉన్న) ప్రక్రియ పూర్తయ్యాక నాటి కన్నా వేగంగా కొన్ని మంచి పనులు చేయగలుగుతున్నాం. దీనిని కూడా గుర్తించాలి. న్యాయ ప్రక్రియతో అడ్డుకోవాలని చూశారు ఆ వేళ కానీ విలీనం తరువాత ఇప్పుడు కొన్ని మంచి పనులు చేసేందుకు అవకాశం దక్కింది. దీనిని కూడా గమనించాలి అని అన్నారు
కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ పార్క్ డెవలప్మెంట్ చేయాలని, మేదర వీధిలో డ్రైన్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు. పాత గూన పాలెంలో కమ్యూనిటీ హాల్ రిపేర్ చేయాలని కోరారు. కొయ్య అనూష అనే స్థానికురాలు రేషన్ కార్డు పునరుద్ధరణ చేయమని అడిగారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, సాధు వైకుంఠ రావు, చల్లా శ్రీనివాసరావు, మెంటాడ స్వరూప్, మండవల్లి రవి , నక్క రామరాజు, పొన్నాడ రిషి, ధర్మాన రఘు, శోభన్, చిన్నారి, చల్లా అలివేలు మంగ, గాయత్రి, మహా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.