మహిళలను చంపే హక్కు ఎవరికీ లేదు

హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత 

గుంటూరు: మహిళలను చంపే హక్కు ఎవరికీ లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేక‌తోటి  సుచ‌రిత హెచ్చ‌రించారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన అత్యంత బాధాకర‌న‌మి ఆమె దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గుంటూరు జి.జి.హెచ్ లో రమ్య మృతదేహాన్ని హోం మంత్రి సుచరిత ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సంఘటనపై సీఎం వైయ‌స్ జగన్ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశార‌ని తెలిపారు.  అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నిందుతుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామ‌ని పేర్కొన్నారు. హత్య కు ముందు యువతితో నిందితుడు ఘ‌ర్ష‌ణ‌కు దిగార‌ని చెప్పారు.  ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాల‌ని, ఉన్మాదుల్లా హత్య చేయడం అత్యంత దారుణమ‌న్నారు.  చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ఉన్మాదంతో దారుణాలకు తెగబడుతున్న ఇలాంటి వాళ్ళను ఏ విధంగా శిక్షించాలో.. ఇటువంటి ఉన్మాదులకు ఉరిశిక్షే  సరైన శిక్షలా అనిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రమ్య ఫోన్ అన్ లాక్ చేసిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుంద‌ని, ఆమె కుటుంబసభ్యులను, స్నేహితులను కూడా విచారిస్తామ‌ని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. 

Back to Top