విజయవాడ: నిరుపేదల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్న సీఎం వైయస్ జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ రామ్ మాట్లాడుతూ.. కేవలం ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పడమే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను, బాధలను కళ్లారా చూశారని, ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. సీఎం వైయస్ జగన్ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు.