23న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ యువతపోరు

 
జిల్లా కలెక్టరేట్‌ల ముందు శాంతియుత నిరసనలు

కలెక్టర్‌లకు డిమాండ్ పత్రాల సమర్పణ

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి

విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు గిన్నీస్‌ రికార్డు  

యోగాంధ్ర పేరుతో ప్రజల దృష్టిని మళ్ళించే యత్నం  

హామీల అమలుపై చిత్తశుద్ది ఏదీ?

నిలదీసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖపట్నం: రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి అంటు వాగ్ధానాలు చేసి, విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ నేడు (సోమవారం అంటే ఈనెల 23వ తేదీన) రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపి, తమ డిమాండ్ పత్రాలను కలెక్టర్‌లకు అందచేస్తారని తెలిపారు. ఏడాది కాలంగా నిరుద్యోగభృతి అమలు చేయకుండా, మరోవైపు కొత్త ఉద్యోగాల భర్తీని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వ మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే.

రాష్ట్రంలో కోటికి పైచిలుకు నిరుద్యోగులు ఉన్నారు. అయిదేళ్ళలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పటి వరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగభృతి కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో ఆయన కల్పించిన ఉద్యోగాలు సున్నా. అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన భృతి కూడా సున్నానే. దీనిని ప్రశ్నిస్తూ సోమవారం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో యువతపోరు పేరుతో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నాం. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో యువత పాల్గొని తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై మాట మార్చిన సీఎం చంద్రబాబు నేడు నిరుద్యోగభృతిని స్కిల్ డెవలప్‌మెంట్‌కు లింక్ చేశామంటున్నారు. అలాగే మహిళలకు ఇచ్చిన హామీని పీ4కి లింక్ చేశాం కాబట్టి దానిని కూడా అమలు చేసేసినట్లేనని చంద్రబాబు అడ్డంగా మాట్లాడుతున్నారు. 

 యోగాంధ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టారు

యోగాతో అందరి ఆరోగ్యం బాగుండాలనే తనపతో కేంద్రం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఏపీ ప్రభుత్వం దీనిని రూ.300 కోట్లు ఖర్చు చేసి ఒక భారీ ఈవెంట్ కింద నిర్వహించడం ద్వారా తమ ప్రచార యావను మరోసారి చాటుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను, విద్యార్ధులు, మహిళలను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశారు. ప్రతిసారీ ఇటువంటి ఈవెంట్ తరహా కార్యక్రమాలకు చంద్రబాబు ఎందుకు ఇష్టపడతారంటే, తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఎవరికైనా అర్థమవుతుంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు హామీల అమలుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటోంది, ప్రజలకు ఏ రకంగా మేలు చేసేందుకు కృషి చేస్తోందనే దానిపైన వారికి ఆసక్తి లేదు. ఇటువంటి పబ్లిసిటీ ఈవెంట్స్‌ నిర్వహించడం, గిన్నిస్‌బుక్‌లో ఎక్కామా, దానిని ఎలా ఫోకస్ చేసుకోవాలనే దానిపైనే చంద్రబాబు దృష్టి అంతా. ప్రజలను మోసం చేయడంలో ఆయన ఎప్పుడో గిన్నీస్‌ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన మీద ఉన్న అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని, విచారణను అడ్డుకుంటున్నందుకు గిన్నీస్ బుక్‌ రికార్డ్‌ సాధించారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.1.59 లక్ష కోట్లు అప్పులు చేసినందుకు చంద్రబాబుకు గిన్నీస్ రికార్డ్‌ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలును అటకెక్కించేశారు. ఏ ఒక్క పథకాన్నీ పూర్తిగా అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. చివరికి తల్లికి వందనం పథకాన్ని కూడా ఇదే తరహాలో అరకొరగా అమలు చేసి, చేతులు దులిపేసుకున్నారు. అన్ని పథకాలను అమలుచేసేశాం, ఎవరైనా దీనిపై మాట్లాడితే వారి నాలుక మందం అంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. యోగాంధ్ర సందర్భంగా తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది హామీల కోసం అడుగుతున్న వారికి కూడా వర్తిస్తుంది.

ఉత్తరాంధ్రకు ఏడాది కాలంగా ఏం చేశారు? 
 
ఉత్తరాంధ్రకు ఈ ఏడాది కాలంలో చంద్రబాబు చేసిన మేలు ఏమిటో చెప్పాలి. ప్రతిసారీ ఏదో ఒక ఈవెంట్‌కు విశాఖను కేంద్రంగా చేసుకుని, ఆర్భాటం చేయడం తప్ప. ఒకవైపు స్టీల్‌ప్లాంట్ పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ వైపు నడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కార్మికులు ఆందోళనలు చేస్తుంటే, పోలీసులతో వారిని బెదిరించారు. ప్లాంట్‌లోని కాంట్రాక్ట్ కార్మికులకు రూ.వేల కోట్లు బకాయిలు పెట్టారు. రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాలను పూర్తి విస్మరించడం వల్లే ప్రజలు ఏడాదిలోనే విసిగిపోయారు. అందుకే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున అభిమానంతో మద్దతు పలుకుతున్నారు. దీనిని కూడా ఓర్వలేక ఆయన పర్యటనలను పూర్తిగా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు.

 
 

Back to Top