తాడేపల్లి: రాష్ట్రానికి ఈఓడీబీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎందుకా ఏడుపు? అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. గతంలో ర్యాంక్‌లు ఇచ్చే ముందు ఫోన్ ద్వారా సమాచారం తీసుకోవడం లేదా సర్వే చేసి, ఏ విధంగా పరిశ్రమలకు ప్రభుత్వం సహకరిస్తుంది అనేది తెలుసుకునే వారు. కానీ మొన్న ఇచ్చిన ర్యాంక్‌ల విధానం పూర్తిగా వేరు. దాదాపు 300 అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆ ర్యాంక్‌లు ప్రకటించారు. అలాగే పారిశ్రామికవేత్తల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. చిన్న పరిశ్రమలు మొదలు మెగా ఇండస్ట్రీస్ వరకు అందరి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. అన్ని కోణాల్లో అన్నీ అధ్యయనం చేశాకే ర్యాంక్‌లు ప్రకటించారు. ఎందుకంత కడుపు మంట?: సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటూ, కేంద్ర ప్రభుత్వం ర్యాంక్‌లు ప్రకటిస్తే దానిపై వారికి (విపక్ష తెలుగుదేశం) కడుపు మంట. దానికి మందు లేదు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు. ఎక్కడా అభివృద్ధి జరగకూడదు. అవి జరిగితే ఈ ప్రభుత్వానికి పేరొస్తుందన్న అక్కసు. అందుకే అంత వ్యతిరేకత. మీకు ఆ అర్హత ఉందా?: మీరు విభజన తర్వాత 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అవకాశం ఇస్తే మంచి చేయలేదు. మేము మంచి పనులు చేస్తుంటే విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు మీకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా?. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎంగారు మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే, ఓర్చుకోలేకపోతున్నారు. మంచి ర్యాంక్ వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని ఇలా విమర్శలు చేస్తున్నారు. మీకు అసలు రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. పబ్లిసిటీ తప్ప వాస్తవం ఉందా?: పారిశ్రామిక అభివృద్ధి అంటే కేవలం పేపర్ల మీద జరిగేది కాదు. మీ హయాంలో 2014 నుంచి 2019 వరకు నాలుగు పార్టనర్‌షిప్ సమ్మిట్లు పెట్టి, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా 40 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. అన్నీ కాగితాల మీదనే ఉండిపోయాయి. ఆ విధంగా నమ్మించి మోసం చేశారు. పారిశ్రామిక అభివృద్ధిని పేపర్లలో చూపించి, రాజధాని అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించి, రాష్ట్రాభివృద్ధిని మాయమాటల్లో చెప్పారు. కానీ ఏ ఒక్క దాంట్లోనూ వాస్తవ అభివృద్ధి లేదు. అలా మోసం చేశారు కాబట్టే, ప్రజలు మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. మాది చేతల ప్రభుత్వం: సీఎంగారు ప్రతి సందర్బంలో చాలా స్పష్టంగా చెబుతున్నారు. వాస్తవ కార్యరూపం దాల్చే వాటి గురించే ప్రజలకు చెప్పమంటున్నారు. ఇటీవల తిరుపతిలో నాలుగు పరిశ్రమలు ప్రారంభిస్తే, వాటిపైనా విమర్శలు చేశారు. మా బిడ్డలకు మీరు పేరు పెడుతున్నారని అన్నారు. మీరు అలా మాట్లాడినంత మాత్రాన పనులు కావు. పరిశ్రమలు రావు. ఏదైనా వాస్తవంగా ఉండాలి. ఆ విధంగా పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కల్పించాలి. ఇవాళ పెద్ద పెద్ద సంస్థలు రావాలన్నా వారికి అనుకూల పరిస్థితులు కల్పించాలి. ‘కియా’ ను తెచ్చిందెవ్వరు?: నిన్న వారు మాట్లాడారు. కియా మోటర్స్ వల్లనే రాష్ట్రంలో ఎగుమతులు పెరిగాయన్నారు. నిజం చెప్పాలంటే రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఆటొమోటివ్ వాటా కేవలం 4 శాతం. దాన్ని పట్టుకుని, కియా మోటర్స్ వల్లనే ఎగుమతులు పెరిగాయని అంటున్నారు. అదేదో కియా మోటర్స్‌ను వాళ్లు తీసుకొచ్చినట్లు. నిజానికి ఆ కంపెనీ వైయస్సార్‌గారి హయాంలో ఏర్పాటైంది. దాని కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆ సంస్థకు కావాల్సిన ఇతర సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సహకారం కావాలంటే అందుకు తగిన నిర్ణయం తీసుకున్నాం. ఎంఎస్‌ఎంఈ రంగం: ఎంఎస్‌ఎంఈలు రానున్న రెండేళ్లలో దాదాపు 1.25 లక్షల యూనిట్లు వచ్చేలా కార్యక్రమం రూపొందిస్తున్నాం. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, దాదాపు 1.50 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆ రంగానికి దాదాపు రూ.1800 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చాం. వచ్చే ఆగస్టులో మరో రూ.500 కోట్లు ఇవ్వబోతున్నాం. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచమంతా ఇబ్బంది పడినా, ఇక్కడ ఏ ఒక్క రంగం కూడా ఇబ్బంది పడకుండా చూశాం. గతంలో చంద్రబాబు ఎక్కడికి పోయినా, నానా హడావిడి. గొప్ప ప్రచారం. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు: గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం టాప్‌లో నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గారు స్వయంగా దావోస్ సమ్మిట్‌లో చెప్పారు. జగన్‌గారి నిర్ణయం వల్ల ఈ రంగంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవబోతుందని ఆయన అన్నారు. అలాగే రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబ«ంధించి దావోస్‌లో ఒప్పందాలు కుదిరాయి. ఇంకా రూ.15 వేల కోట్ల పెట్టుబడులపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అదానీకి సంబంధించి ఎనర్జీ ప్రాజెక్టుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా సరే, కేవలం పేపర్లపైనే పరిమితం కాకండా, వాస్తవంగా గ్రౌండ్ అయ్యే వాటినే చెబుతున్నాం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి, ఇక్కడికి పారిశ్రామివేత్తలను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధ్దంగా ఉంది. అది ధనసేన పార్టీ: పవన్‌కళ్యాణ్ తన పార్టీ జససేనను ధనసేనగానూ, జనవాణి కార్యక్రమాన్ని ధనవాణిగా మార్చుకుంటే బాగుంటుంది. ఆయన పార్టీ పెట్టి దాదాపు 8 ఏళ్లు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు వారి భాగస్వామ్యుడిగా ఉన్నాడు. ఆ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ప్రతి మాట అమలయ్యేలా చూస్తానన్నాడు. కానీ ఏదీ పట్టించుకోలేదు. మరి అప్పుడు జనవాణి కార్యక్రమం ఏమైంది? ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుని, ఇప్పటికే 95 శాతం మేనిఫెస్టో అమలు చేసిన మా ప్రభుత్వంపై ఎందుకీ విమర్శలు? మా ప్రభుత్వాన్నా ఆయన ప్రశ్నిస్తున్నాడు? అసలు దేనికి జనవాణి?. ఆయనకు ఎక్కడ డబ్బు వస్తుందో, అక్కడ వేలంపాటలో పాల్గొంటే మంచిది. ఆప్షనల్ పాలిటిక్స్ కేవలం పవన్‌కు మాత్రమే చెల్లుతుంది. అసలు ఆప్షనల్ రాజకీయాలను ఇంత వరకు మేము చూడలేదు. 8 ఏళ్లలో 8 పార్టీలతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందా? ఒక్క జనసేన తప్ప!. అలాంటి పార్టీని, అలాంటి నాయకుడిని మేము ఇంత వరకు చూడలేదు.