శవాల మీద పేలాలు ఏరుకునేలా టీడీపీ తీరు

విపత్కర పరిస్థితుల్లోనైనా శవరాజకీయాలు మానుకో చంద్రబాబూ  

రూ.6500 కోట్ల ఆదాయం ఉందనేది పచ్చి అబద్ధం

బాబు పెట్టిన బకాయిలను కూడా మా ప్రభుత్వమే చెల్లించింది

కరోనా నేపథ్యంలో ప్రభుత్వంపై అదనపు భారం పడింది

కోతలు పెట్టే ఆలోచన సీఎం వైయస్‌ జగన్‌లో ఏమాత్రం లేదు

ఉద్యోగులు అంగీకరించాకే వేతనాలు వాయిదా పద్ధతి నిర్ణయం

కోతలు, వడపోతలు చంద్రబాబుకే చెల్లింది

చంద్రబాబు, టీడీపీ వైఖరిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

తాడేపల్లి: విపత్కర పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ శవాల మీద పేలాలు ఎలా ఏరుకోవాలి. శవరాజకీయాలు ఎలా చేయాలని చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపు, కాంట్రాక్టర్లకు చెల్లింపు అంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట ఆదాయం గణనీయంగా తగ్గిందని, అనుకోని ఖర్చు ప్రభుత్వంపై పడడంతో ఖర్చు అధికమైందన్నారు. దీంతో వాయిదాల రూపంలో వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వ ఉద్యోగులను కోరామని, ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకొని అంగీకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైయస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారని సజ్జల వివరించారు. అనవసర విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని చంద్రబాబు, టీడీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పబ్లిసిటీకి దూరంగా ఉంటారని, మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపిద్దాం అనేది సీఎం వైయస్‌ జగన్‌ పాలసీ అన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కరోనా వైరస్‌ నియంత్రణకు భౌతిక దూరం ఒక్కటే విరుగుడు. ప్రపంచ మానవాళి మొత్తం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వాలు కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. ఇంకోపక్క మామూలుగా పెట్టే ఖర్చుకంటే కూడా ప్రభుత్వాల మీద అదనపు భారం పడింది. మన రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఇళ్లకే పరిమితం చేస్తూనే విపత్తుకాలంలో ఖర్చుకు వెనకాడకుండా నిరుపేదలు, వలస కార్మికులు భోజనం, ఆశ్రయం కల్పిస్తుంది. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. అయినా సరే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరిట రాష్ట్ర ఖజానాను ఊడ్చేశాడు. కమీషన్లు, ప్రాజెక్టుల రూపంలో ఎడాపెడా లక్షల కోట్లు దోచుకున్నాడు. ప్రభుత్వం నుంచి దిగిపోతూ దుబారా చేయడమే కాకుండా, అప్పులభారం, పెండింగ్‌ బిల్లుల భారం పడేసి వెళ్లాడు.  రూ.40 వేల కోట్ల పవర్‌ బిల్స్‌ కాకుండా  రూ.60 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు పెట్టి వెళ్లాడు. ఈ పది నెలల కాలంలో రోజూ ఆదాయం వస్తూనే ఉందని చంద్రబాబు అంటున్నాడు. చివరకు బ్యాంకుల్లో కూడా అప్పుపుట్టని పరిస్థితిని క్రియేట్‌ చేశాడు చంద్రబాబు. ఈ రోజు ఆదాయం ఉందని అనడానికి నాలుకా.. లేక అది తాటిమట్టా..?

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఎల్లోమీడియా తాటికాయంత అక్షరాలతో ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేస్తోంది. వాటిని చూసి నమ్మేవారికి క్లారిఫికేషన్‌ ఇస్తున్నాను. 

రూ.6500 కోట్లు చివరి రెండ్రోజుల్లోనే కాంట్రాక్టర్లకు చెల్లించామని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వాస్తవం ఏంటంటే.. రూ.2 వేల కోట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు, రూ.16 వందల కోట్లు పేదల ఇళ్ల స్థలాల భూసమీకరణకు, రూ.6 వందల కోట్లు ఆరోగ్యశ్రీకి, పింఛన్ల చెల్లింపునకు రూ.15 వందల కోట్లు చెల్లించాం. 

చంద్రబాబు చేసిన అప్పులు, పెండింగ్‌ బిల్లులను వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.90 వేల కోట్లు అప్పు ఉంటే దాన్ని ఐదేళ్లలో చంద్రబాబు రూ. 2.50 లక్షల కోట్లు, పెండింగ్‌ బిల్లులు రూ. 60 వేలు కలిపితే రూ. 3.10 లక్షల కోట్లు. 

ఫీజురీయింబర్స్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిపోయిన బకాయి రూ.1200 కోట్లు, రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయి రూ.900 కోట్లు, ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు రూ.650 కోట్లు, ఇవేకాకుండా మధ్యాహ్న భోజనం, అన్న క్యాంటీన్‌, ఆశవర్కర్లు ఇలా చిట్టా మొత్తం పెద్దగా ఉంది. ఇవన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. 

కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రూ.800 కోట్లు చెల్లించాం. చింతలపూడి ఎత్తిపోతల కోసం నబార్డు ఇచ్చిన నిధులు ఇచ్చాం. ఆ నిధుల్లోని రూ.270 కోట్లు ఆర్‌వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెల్లించారు. ఆర్‌వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎవరి బంధువులో టీడీపీ వారు, ఎల్లో మీడియా చెప్పాలి. 

రూ.6500 కోట్ల నిధులు ఉంచుకొని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదనేది పచ్చి అబద్ధం. కరోనా విపత్తుతో రోజువారి ఆదాయం ఆగిపోయింది. జీఎస్టీ, ఎక్సైజ్‌, పెట్రోల్‌ రూపంలో వచ్చే ఆదాయం ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులను సంప్రదించి జీతం వాయిదాల్లో వేస్తామని కోరడంతో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని ఉద్యోగులు కూడా అంగీకరించారు. అందుకు సీఎం కూడా కృతజ్ఞత తెలిపారు. ఉద్యోగులను కించపరిచే విధంగా ప్రకటనలు ఇవ్వొద్దు అని టీడీపీని కోరుతున్నాం. 

రూ.వెయ్యి చొప్పున రేషన్‌కార్డు దారులకు ఆర్థిక సాయం కోసం నిధులు విడుదల చేయడం. ధాన్యం బకాయిలుగా మార్చి నెలలోనే రూ.2 వేల కోట్లు, కేంద్రం నుంచి మరో రూ.2 వేల కోట్లు చెల్లించడం జరిగింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్న ప్రభుత్వానికి వీలైతే సహకారం అందించాలి. లేదా సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ ఇళ్లలో కూర్చోవాలని విజ్ఞప్తి. అంతేతప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని సలహా ఇస్తున్నా.' కోతలు, వడపోత చంద్రబాబుకే చెల్లుతుంది. చెప్పినదానికంటే ఎక్కువ చేయాలనే సీఎం వైయస్‌ జగన్‌లో కనిపిస్తుందని, కోతలు పెట్టే ఆలోచన సీఎం వైయస్‌ జగన్‌లో లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  
  

Back to Top