రోడ్లపై తిరిగే రౌడీల్లా టీడీపీ సభ్యుల ప్రవర్తన‌

గౌర‌వ స‌భ‌లో నిన్న విజిల్స్.. ఈరోజు చిడతలు, తాళాలు వాయిస్తూ అల్లరి 

40 ఇయ‌ర్స్‌ ఇండస్ట్రీ వారి పార్టీ స‌భ్యుల‌కు ఇచ్చే శిక్షణ ఇదేనా..?

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ధ్వ‌జం

అమ‌రావ‌తి: శాస‌న‌స‌భ‌లో టీడీపీ స‌భ్యుల ప్రవర్తన ప్రజాప్రతినిధులు తలదించుకునేలా ఉంద‌ని, రోడ్లపై తిరిగే పోరంబోకులు, రౌడీల్లా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని, సిగ్గు, మానం, మర్యాద, సంస్కారం అన్నవి ఏమీ లేవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్ర‌భుత్వ విప్ కాపు రామ‌చంద్రారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కాపు రామ‌చంద్రారెడ్డి మాట్లాడారు. స‌భ‌లో నిన్న విజిల్స్.. ఈరోజు చిడతలు, తాళాలు వాయిస్తూ టీడీపీ సభ్యులు అల్లరి చేస్తున్నారని, సభ స‌జావుగా జరగకూడదన్నదే టీడీపీ ఉద్దేశంగా క‌నిపిస్తుంద‌న్నారు. సభలో వారే ప్రశ్నలు వేస్తారు.. సమాధానం అవసరం లేదన్నట్లుగా వారే అల్లరి చేస్తున్నార‌న్నారు. అసెంబ్లీ అనేది టీడీపీ ఒక్కరిదే కాదు..‌ 175 మంది సభ్యులది అని గుర్తుంచుకోవాల‌న్నారు.  

ఇంత నీచ, నికృష్ట‌ రాజకీయాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని, టీడీపీ స‌భ్యుల‌ చేష్టలు ప్రజలంతా గ‌మ‌నిస్తున్నార‌న్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నెగ్గితే.. వచ్చే ఎన్నిక‌ల్లో  ముగ్గురు కూడా నెగ్గరన్నారు. 40 ఇయ‌ర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు.. వారి పార్టీ స‌భ్యుల‌కు ఇచ్చే శిక్షణ ఇదేనా..? అని ప్ర‌శ్నించారు. టీడీపీ స‌భ్యులు ఇకనైనా మనుషుల్లా ప్రవర్తించాలని కోరారు.  మనుషుల‌కు ఉండే సాఫ్ట్‌వేర్ టీడీపీకి స‌భ్యుల‌కు లేద‌ని, రాక్షసులకి ఉండే సాఫ్ట్‌వేర్ వారి బుర్రల్లో ఉన్నట్టుంద‌న్నారు. చంద్రబాబు సభకు రాకుండా, అసెంబ్లీలో వారి సభ్యులచేత అదే పనిగా అల్లరి చేయిస్తూ, చాలా నీచాతి నీచానికి దిగజారుతున్నారని, టీడీపీ నీచ రాజకీయాలకు ప్ర‌జ‌లే తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

Back to Top