ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యత ఉండాలి

కనీస సౌకర్యాలపై అధికారులు తనిఖీలు చేయాలి

వైయస్‌ఆర్‌ చేయూత లబ్ధిదారులను గుర్తించాలి

ట్రైబల్‌ యూనివర్సిటీ, మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీలు..

ఏడు ఐటీడీఏల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు గ్రీన్‌ సిగ్నల్‌

క్యాంపు కార్యాలయంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ శాఖలపై సమీక్ష

తాడేపల్లి: ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యత ఉండాలని, కనీస సౌకర్యాలపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సంబంధించి మూడు దశల్లో 9 సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. డిమాండ్‌ ఉన్న చోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్స్‌లో వసతుల కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా అన్నదానిపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. 309 హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత మంత్రులు, అధికారులకు సూచించారు.  వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరచే నాటిని యూనిఫామ్స్, పుస్తకాలు అందించాలని, ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని సూచించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నామినేటెడ్‌ పోస్టులు, వర్కుల్లో కచ్చితంగా 50 శాతం ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వైయస్‌ఆర్‌ చేయూత కింద లబ్ధిదారులను గుర్తించాలని, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా రూ. 18,750 ఇవ్వనున్నట్లు తెలిపారు. 

సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అదే విధంగా ఏడు ఐటీడీఏల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్‌ పురం, దోర్నాలలో ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రతిపాదనలు తయారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులకు అటవీ భూముల పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలన్నారు. ఎస్సీలు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్ల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 
 

Back to Top