విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై వెంటనే స్పందించాం

పదిరోజుల్లో బాధిత కుటుంబాలకు సాయం అందించాం

పొల్యూషన్‌ కంట్రోల్‌ యాక్ట్‌లో మార్పు తెస్తున్నాం

మేధోమథన సమీక్షంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: విశాఖలో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, గ్యాస్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు అండగా నిలిచామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. ఆలస్యం చేయకుండా రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు సాయం అందించామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో బాధితులకు సాయం అందజేశామన్నారు. ఘటనపై కమిటీలు కూడా వేయడం జరిగిందని బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 

‘విశాఖలో ఈ మధ్య జరిగిన గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఎల్‌జీ పాలిమర్స్‌ మల్టీనేషనల్‌ కంపెనీ.. ఎవరూ ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందని వెంటనే అరెస్టులు చేయడం, దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి.. ఎలా జరిగిందని విచారణ చేయాలి.. ఇవన్నీ చేయకుండా దురుసుగా ప్రవర్తిస్తే.. ఇండస్ట్రీ కమ్యూనిటీ పాడవుతుంది. ఏపీలో ర్యాష్‌గా నిర్ణయాలు తీసుకుంటారు.. అక్కడ పెట్టుబడులు పెట్టడం ఎందుకని ఆలోచన వస్తుంది. ఇదే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలు చనిపోతారు.. గవర్నమెంట్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుష్ప్రచారం మొదలవుతుంది. 

ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తండ్రిగా ఉన్నప్పుడు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఆ అభివృద్ధి వల్ల మన ప్రజలకు మంచి జరగాలి.. ఇంకోవైపు ఆ అభివృద్ధి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా విశాఖ ఘటనపై స్పందించాం. కంపెనీ హెల్ప్‌ తీసుకున్న తరువాతే మన ప్రజలకు మంచి చేయాలని ఆలస్యం చేయలేదు. మనం ఏం చేయగలమో.. ఆలోచించి వెంటనే ముందుకు అడుగులు వేశాం. రూ. 50 కోట్లు విడుదల చేసి బాధితులను పది రోజుల్లోనే ఇచ్చాం. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం పదిరోజుల్లో అందజేశాం. బాధితులకు అండగా నిలిచే కార్యక్రమాలన్నీ చేశాం. 

ప్రమాదం ఉదయం 3:30 గంటలకు జరిగిందని సమాచారం రాగానే 4:30 గంటలకు పోలీసులు, కలెక్టర్, అంబులెన్స్‌లు అన్నీ చేరుకునేలా చేశాం. అందరినీ ఆస్పత్రుల్లో చేర్చి మెరుగైన వైద్యం అందించాం. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందనే గట్టి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాం. ప్రమాదం జరిగిన కంపెనీపై కమిటీలు వేశాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కమిటీలను కూడా లేఖ రాసి పిలిపించాం. అన్నీ కమిటీలు ఘటనపై విచారణ చేస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అలారం ఎందుకు మోగలేదని ఈ కమిటీలన్నీ ఆరా తీస్తున్నాయి. 

మనం కమిటీలు వేసి కనుక్కోవడం కాకుండా ప్రజల దగ్గర నుంచి కూడా ఆ కంపెనీపై ఉన్న ప్రశ్నలు, సందేహాలు అన్నీ తీసుకుంటున్నాం. కమిటీల దర్యాప్తు పూర్తయింది. కంపెనీని అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసి పెట్టుకున్నాం. వీటికి కంపెనీ ఇచ్చే సమాధానం చూసిన తరువాత ఎలాంటి యాక్షన్‌ తీసుకోవాలో.. తీసుకుంటాం. స్టైరీన్‌ మొత్తం అక్కడి నుంచి తరలించాం. రాబోయే రోజుల్లో దాన్ని గ్రీన్‌ప్లాంట్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. 

ఆరెంజ్‌ అండ్‌ రెడ్‌ కేటగిరికి చెందిన ఇండస్ట్రీలు జనాభా ఎక్కువ ఉన్న చోట స్థాపించకూడదు. పొల్యూషన్‌ కంట్రోల్‌ యాక్టును పూర్తిగా మార్పు చేస్తున్నాం. దీనిపై సమీక్షలు జరుపుతున్నాం. అందరినీ కలుపుకొని పోయే విధంగా రూపొందిస్తాం. 
 

Back to Top