శ్రీకాకుళం : వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదలలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. సింగుపురం పంచాయతీ, మామిడివలసలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "సంక్షేమం, అభివృద్ధి రంగాలలో వచ్చిన మార్పులను గమనించాలి. ఇది వరకూ మీ గ్రామాన ఉన్న పాఠశాల ఎలా ఉండేది..ఇప్పుడెలా ఉంది..? అదేవిధంగా ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు వీటి ఏర్పాటు, పనితీరు ఇవన్నీ అభివృద్ధిలో భాగమే కదా ! అభివృద్ధి లేదు అని చెప్పడం భావ్యం కాదు. అటువంటి విపక్ష విమర్శలను తిప్పికొట్టండి. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం అమల్లో భాగంగా ఏడాదికి 13వేల 500 రూపాయలు అందిస్తున్నాం. ఈ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. ఈ పథకం అనేకాదు ప్రతి పథకం అమలు విషయమై కానీ వర్తింపు చేసే పద్ధతిలో కానీ అవినీతికి తావులేదు.లంచగొండితనానికి ఆస్కారం లేదు. ఇది కాదా మార్పు ? వీటిని మీరు గుర్తించాలి. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ కూడా ఏ ఒక్కరికీ ఆకలి అన్నది లేకుండా నిరాటంకంగా నిత్యావసర సరకులు ఇళ్ల వద్దకే తెచ్చి అందించగలిగాం. ఆ విషయాన్ని మీరు మరిచిపోకూడదు. దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగలేదు. దీని కోసం మీరంతా ఒక్కసారి ఆలోచించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ... పుట్టినప్పటి నుంచి పెద్ద చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడేంత వరకూ అన్ని బాధ్యతలూ ప్రభుత్వమే తీసుకుంటోంది" అని చెప్పారు. ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నామని ప్రస్తావిస్తూ, ఇంటి స్థలం కేటాయింపు నుంచి ఇల్లు కట్టించి ఇచ్చేంత వరకూ అన్నీ ఆడబిడ్డల పేరునే సంబంధిత ప్రక్రియ సాగే విధంగా చేస్తున్నామన్నారు. గతంలో ఆడవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది కాల క్రమేణా అది తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో పరిస్థితులు మారేయి.. వాటికి అనుగుణంగానే పథకాల రూపకల్పన, అమలు అన్నవి సాగుతున్నాయి అన్న సంగతి మరువవొద్దు అని అన్నారు. బతికే ధైర్యం వచ్చింది..జీవన ప్రమాణం పెరిగింది పేదలలో జీవన ప్రమాణాలు పెరగడంతో బతికే ధైర్యం వచ్చిందని, సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు తీసుకుని రావడమే ఉత్తమ పాలనకు, సామాజిక దృక్పథానికి తార్కాణం అని, అటువంటి భావజాలంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని పోల్చి చూడండి.. పాలనలో తేడా ఏంటన్నది తెలుస్తుంది అని చెబుతూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ధరల విషయమై పక్క రాష్ట్రాలతో పోల్చి చూడాలని, ఈ విషయమై విపక్షం చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మ వద్దని హితవు చెప్పారు. మూడేళ్ల పాలన అనంతరం సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి.. తెలుసుకునేందుకు, అభివృద్ధి ఏ మేరకు జరిగింది అన్నది వివరించేందుకే తాను ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు.. అంతకుముందు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే సంక్షేమ పథకాలు కచ్చితంగా అందుతాయని స్పష్టం చేశారు. ఇది పేదల ప్రభుత్వం అని, సామాజిక న్యాయం, సామాజిక ఉన్నతి అన్నవి ప్రధానంగా అందించే ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి నిర్మల శ్రీనివాస్, ఎమ్మార్వో వెంకట రావు, ఎంపిడివో వెంకట్ రామన్, జెడ్పిటిసి రుప్పా దివ్య, సర్పంచ్ ఆదిత్య, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, వైయస్ఆర్‌సీపీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, బగ్గు అప్పారావు, నక్క శంకర్, మోహన్, అల్లు లక్ష్మీ నారాయణ, చిట్టి రవి, ఉటపల్లి కృష్ణ, చంద్రమౌళి, ఏచేర్ల శ్రీధర్, రంది రాజారావు, జగదీష్, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.