తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం పీపీపీకి ఇస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఒక్కో సీటుకు ఏడాదికి ఏకంగా రూ.57.50 లక్షల చొప్పున ఫీజు వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంత భారీగా ఫీజులు నిర్ణయించడం వెనుక రేపటి టెండర్లలో పోటీ పెంచి.. మీకింత–నాకింత పేరుతో భారీగా కమీషన్లు దండుకునే కుట్ర దాగి ఉందని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత వైయస్ జగన్ ప్రభుత్వంలో ఈ సీట్లకు రూ.20 లక్షల చొప్పునే ఫీజు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఏకంగా ఒక్కో సీటుపై అదనంగా ఏటా రూ.37.50 లక్షలు పెంచడం అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉండనుందో ఇట్టే స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ ఫీజులను ఖరారు చేసింది. అప్పట్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రస్తుత కూటమి పార్టీలు తీవ్రంగా తప్పు పట్టాయి. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ అయితే, తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ విధానం రద్దు చేయకపోగా, ఏకంగా కళాశాలలనే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి.. విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకోండని వారికి లైసెన్స్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూములను ఎకరం రూ.వందకే లీజుకు ఇవ్వడంతోపాటు, కళాశాలలు, బోధనాస్పత్రిపై 66 ఏళ్లు హక్కులు కల్పించడంతోపాటు వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రైవేట్ కళాశాల కంటే ఫీజు ఎక్కువ ⇒ ప్రైవేట్ కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజు ఉంది. నీట్‌లో రాణించినప్పటికీ డిమాండ్‌కు తగ్గ ఎంబీబీఎస్ సీట్లు లేక ఏటా రాష్ట్రంలో వందల సంఖ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు. దీంతో పిల్లలను ఎలాగైనా వైద్య విద్య చదివించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఖర్చు పెట్టి విదేశాలకు పంపుతున్నారు. ఇలా వెళ్లే విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించే సమయంలో, అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, మ«ద్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజును కొత్త కళాశాలల్లో రూ.20 లక్షలుగా గత ప్రభుత్వం ఖరారు చేసింది. ⇒ దీంతో అప్పటి వరకు ప్రైవేట్‌లో సంపన్న కుటుంబాలకే పరిమితం అయిన ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు మధ్య తరగతి పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చినట్లైంది. అయితే ఇప్పుడు ఆ ఫీజును ఏకంగా మరో రూ.37.50 లక్షల మేర పెంచి మొత్తంగా రూ.57.50 లక్షలు చేసి.. పెట్టుబడిదారులకు భారీ లాభం చేకూర్చాలని ప్రభుత్వం చూస్తోంది. ⇒ సర్కారు నిర్ణయం కారణంగా ప్రైవేట్ కళాశాలలతో పోల్చినా పీపీపీ కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు రూ.17.9 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం. ఇలా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ వైద్య కళాశాలల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసుకునే హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు కల్పిస్తూ పైకి మాత్రం పీపీపీతో విద్యార్థులకు ఎటువంటి నష్టం వాటిల్లదంటూ చంద్రబాబు మోసానికి పాల్పడుతున్నారు. దండుకుందాం రండి.. మాకింత.. మీకింత! ⇒ సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల సంపదను కొల్లగొట్టే పనిలో పడ్డారు. ప్రభుత్వాస్తులను కారుచౌకగా అస్మదీయులకు కట్టబెట్టడమే కాకుండా, తద్వారా వ్యాపారం చేసి వారిని మరింత సంపన్నులుగా తీర్చిదిద్దే కుట్రకు తెరలేపారు. ఇందుకు పీపీపీ విధానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా పీపీపీ పేరిట దోపిడీ కార్యక్రమాలకు తెరతీశారు. ఇందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణే కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. ⇒ చంద్రబాబు ఒత్తిడి మేరకు రూపొందించిన ప్రతిపాదనల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ కోటా ఎంబీబీఎస్ సీటును ఏటా రూ.57.50 లక్షలకు పెంచడమే కాకుండా.. ఇక్కడ పెట్టుబడి పెడితే విద్యార్థుల నుంచి ఎంబీబీఎస్‌లో ఇతర కోటా సీట్లు, పీజీ, నర్సింగ్, ఇతర వైద్య విద్యా కోర్సుల ఫీజులతోపాటు, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, డయాగ్నోస్టిక్స్, మందులకు చార్జీల రూపంలో మరింత ఆదాయం వస్తుందని వైద్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయడం విస్తుగొలుపుతోంది. విద్యార్థులపై భారం లేదంటూనే మోసం ⇒ మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో నిర్వహణ వల్ల విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవన్నీ బూటకపు ప్రకటనలేనని అధికారుల ప్రతిపాదనల ద్వారా తేటతెల్లం అవుతోంది. ⇒ సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పీపీపీ ప్రాజెక్టుల్లో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఎక్కువ మేలు తలపెట్టేలా చూస్తుంది. కానీ, స్వతహాగా నయా పెత్తందారు అయిన చంద్రబాబు మాత్రం అస్మదీయులకు భారీ లబ్ధి చేకూరేలా రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టడమే కాక, వైద్య విద్య వ్యాపారం రూపంలో అస్మదీయులు భారీగా ఆర్జించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ⇒ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి ఏకంగా రూ.అరకోటికి పైగా వసూలు చేసుకోవడానికి పేటెంట్ ఇచ్చేస్తున్నారు.