విజయవాడ: రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మా కార్యకర్తలందరినీ జైల్లో వేసుకోండి. మేం సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. నీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు అన్నీ ఎదుర్కొంటాం. మీకు చేతనైంది చేసుకోండి. మిమ్మల్ని నిలదీయకుండా వదలం. మేం న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్, మాజీ మంత్రి. – మా అబ్బాయి అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేశాడు. చంద్రబాబూ, నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్ అయిన భూములు ఎవరైనా కొంటారా?. నా మీద కక్ష తీర్చుకోవాలంటే తీర్చుకోండి. దయచేసి ఆలోచించుకోండి. ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇలా కక్ష రాజకీయాలు, దుర్మార్గాలకు ఒడిగట్టొద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాపై ఎందుకు అమలు చేస్తున్నారు?. ఇప్పటికైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయండి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. పేర్ని నాని, మాజీ మంత్రి. – కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారు. అక్రమంగా అరెస్ట్‌లు చేస్తారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా?. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్ చేశారు. చంద్రబాబు మీకు ఒకటే చెబుతున్నాం. 175 నియోజకవర్గాల్లో మా కార్యకర్తలందరినీ జైల్లో వేసుకోండి. మేం సిద్ధంగా ఉన్నాం. నీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు అన్నీ ఎదుర్కొంటాం. మీకు చేతనైంది చేసుకోండి. మిమ్మల్ని నిలదీయకుండా వదలం. మేం న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తాం. కచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. రాజకీయ పోరాటం చేస్తాం. 2029నాటికి నీ ప్రభుత్వాన్ని పడదోయడానికి కావాల్సిన అన్ని పోరాటాలు చేస్తాం. మాపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలనే లక్ష్యంతో మీరు పని చేస్తున్నారు. జోగి రమేష్‌కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు. కొనుక్కున్న వారు లేరు. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా?. ఈ తప్పుడు కేసులపై న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తాం. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారు. అయినా వారినేమీ అనరు. తండ్రిని ఏం చేయలేక పిల్లలపై కేసులు పెట్టి వేధించడం అంటే ఇదే. తాము నిజంగా తప్పు చేసి ఉంటే, ఉరి వేసుకుంటామని జోగి రమేష్ ప్రకటించారు. జోగి రమేష్ సతీమణి. – నా బిడ్డను ఇలా అరెస్ట్ చేయడం బాధాకరం. వారికి కూడా బిడ్డలున్నారు కదా?. మరీ ఇంత అన్యాయమా?. చంద్రబాబు కూడా ఆలోచించాలి. నా బిడ్డ ఏం పాపం చేశాడు?. చంద్రబాబు ఇంటిపైకి నా భర్త వెళ్ళాడంటారు. కానీ, ఆయన అక్కడికి వెళ్ళింది నిరసన తెలపడానికి. ఇది నిజం. అప్పటి సీఎం జగన్‌గారిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడడం వల్లనే, నిరసన వ్యక్తం చేయడానికి ఆయన (జోగి రమేష్) అక్కడికి (చంద్రబాబు నివాసం) వెళ్లారు. అది తప్పా?. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా వేధిస్తారా?. వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి. – రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అందుకే ఇదంతా. ఒక బీసీ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. మేరుగ నాగార్జున, మాజీ మంత్రి. – అక్రమ కేసులతో వేధించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతే ఇదంతా జరుగుతోంది. ఏ తప్పూ చేయకపోయినా, జోగి రమేష్ కుటుంబాన్ని ఇలా వేధిస్తారా?. మేం పరామర్శించడానికి రావొద్దా? అది తప్పా?. లేళ్ళ అప్పిరెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత. – జోగి రమేష్ గారి గొంతు నొక్కాలని వారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం?. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి బెదిరింపులకు ఆయన (జోగి రమేష్) భయపడరు, రమేష్ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. జగన్ గారి ఆదేశాల మేరకు మేమంతా ఇక్కడికి వచ్చాం. దేవినేని అవినాష్. వైయస్సార్‌సీపీ నేత. – రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మా పార్టీ శ్రేణులు రమేష్ గారి కుటుంబానికి అండగా ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ.