నంద్యాల జిల్లా : పార్టీని బలోపేతం చేయడంలో గ్రామ కమిటీ సభ్యులు కీలకంగా పనిచేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సున్నిపెంటలో శనివారం ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ అనుబంధ విభాగాలు, గ్రామ కమిటీలు ఎలా ఏర్పాటు చేయాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల నూతనంగా ఎంపికైన పార్టీ గ్రామ కమిటీల విధి నిర్వహణపై నాయకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తూ, ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆక్షేపించారు. ఎక్కడైనా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారని, కానీ, చంద్రబాబు మాత్రం ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దాదాపు ఎత్తేసే పరిస్థితి తెచ్చారని, వైద్య కళాశాలలను పైవేటు రంగానికి ఇచ్చేస్తున్నారని అన్నారు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా అడిగే వారు లేరని సొంత మీడియాతో ప్రచారం చేయింకుంటున్నారని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనీయబోమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారన్నారు. ప్రజల్లోకి వెళ్లి కోటి సంతకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి, కోటి సంతకాలు సేకరించి, గవర్నర్‌కు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గంగుమాల శోభన్‌బాబు, మండల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.