అనంతపురం: ప్రభుత్వ పెద్దల అండదండలతోనే రాష్ట్రంలో నకిలీ లిక్కర్ దందా యథేచ్చగా సాగుతోందని, అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకి దమ్ముంటే సీబీఐ విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ములకలచెరువులో భారీ స్థాయిలో నకిలీ లిక్కర్ తయారీ యూనిట్ బయటపడిన తర్వాతైనా మద్యం షాపుల్లో తనిఖీలు చేయకపోవడంతో పాటు జయచంద్రా రెడ్డి, జనార్దన్ రావు, కట్టా సురేంద్ర నాయుడు వంటి టీడీపీ నాయకులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే, ఈ ప్రభుత్వ ఉద్దేశాలు అర్థమవుతున్నాయని అన్నారు. లిక్కర్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, ఆ కంపును వైయస్సార్సీపీకి అంటించాలన్న కుట్రతోనే జోగి రమేశ్‌ను అక్రమంగా ఇరికించే కుట్ర జరుగుతోందని, చంద్రబాబుకి దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... ● ప్రణాళిక ప్రకారమే నకిలీ లిక్కర్ తయారీ ములకలచెరువు నకిలీ లిక్కర్ దందా వెనుక తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ తంబళ్లపల్లె ఇన్‌చార్జి జయచంద్రా రెడ్డి పాత్ర ఆధారాలతో సహా బయటపడినా ఇంతవరకు ఆయన్ను అరెస్టు చేయలేదు. పెద్ద స్థాయిలో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని తెలిసినా ఎలాంటి చర్యలు లేవు. కానీ సీఎం చంద్రబాబు ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోవడం కానీ, కనీసం తీసుకుంటామని చెప్పడం కానీ చేయడం లేదంటే ఇది ప్రభుత్వ సహకారంతోనే నడుస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఈవీఎంల పైన ఉన్న విశ్వాసంతో అధికారంలోకి వస్తామని నమ్మకంతో ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారులన్న జయచంద్రా రెడ్డిని ఎన్నికలకు మూడు నెలల ముందు పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ములకలచెరువులో నకిలీ లిక్కర్ తయారీ యూనిట్ నెలకొల్పి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులున్న డిస్టిలరీల నుంచి లిక్కర్ కొనుగోలు చేయకుండా దాని స్థానంలో ములకలచెరువులో తయారు చేసిన నకిలీ లిక్కర్ తోనే యథచ్ఛేగా వ్యాపారం చేస్తూ మద్యపాన ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా 16 నెలలుగా భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇది ప్రభుత్వమే సాగిస్తున్న నకిలీ లిక్కర్ వ్యాపారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లిక్కర్ షాపులను లాటరీలో టీడీపీ వారికే దక్కేలా పోలీసులు, అధికారులను మోహరించారు. వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇచ్చి ఒక్కో గ్రామంలో మూడు నాలుగు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా విచ్చలవిడిగా నకిలీ లిక్కర్ సరఫరా, వినియోగాన్ని భారీగా పెంచేసి అందినకాడికి దోచేస్తున్నారు. ● ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్ అమ్మినట్టు అంగీకరించినట్టేగా? నకిలీ లిక్కర్ దందా వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ అండదండలతోనే నకిలీ మద్యం తయారు చేసి అడ్డదారిలో విక్రయిస్తున్నారని మద్యపాన ప్రియులకు అర్థమయ్యాక నిందితులపై చర్యలు తీసుకునేలా మద్యం షాపుల్లో తనిఖీలు చేయకుండా క్యూఆర్ కోడ్ పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానం అమల్లో ఉన్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగించివేసింది. ఇప్పుడు నకిలీ గుట్టురట్టవడంతో 16 నెలల తర్వాత మళ్లీ తీసుకొస్తున్నట్టు చెప్పడం అంటే ఇన్నాళ్లు దోచుకున్నామని అంగీకరించినట్టే కదా? అడ్డగోలుగా దందాలు చేసి దొరికినప్పుడల్లా సిట్ పేరుతో మాఫీ చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటైంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం, ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో కుటీర పరిశ్రమలా నకిలీ లిక్కర్ పరిశ్రమ నడవడం సాధ్యం కాదు. చంద్రబాబుకి ఏమాత్రం నిజాయితీ ఉన్నాసరే నకిలీ లిక్కర్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలి. ● వైఫల్యాలు బయటపడినప్పుడు పవన్ కళ్యాణ్ దాక్కుంటే ఎలా? కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోయింది. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సరైన వైద్యం అందించలేక వారి చావులకు కారణమైంది. కురుపాం గురుకుల హాస్టల్‌లో పచ్చ కామెర్లతో (హెపటైటిస్ ఏ) ఇద్దరు విద్యార్థినులు మరణించడానికి వైద్యశాఖకు సంబంధం లేదని వైద్యశాఖ మంత్రి ప్రకటించారు. అలా అయితే పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించే పంచాయతీరాజ్, నారా లోకేశ్ నిర్వహించే విద్యాశాఖ వైఫల్యాలే వారి మరణాలకు కారణం కాదా? దీనిపై ఆ మంత్రులిద్దరూ ఎందుకు స్పందించడం లేదు? కూటమి ప్రభుత్వ దాదాపు ఏడాదిన్నర పాలనలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటీ జరగలేదు. చంద్రబాబుకి పరిపాలన చేతకావడం లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రతీకార రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ చేస్తున్న చీప్ పాలిటిక్స్ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రభుత్వ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడంతోనే అభివృద్ది జరిగిపోతుంది అన్నట్టు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు భ్రమలు కల్పిస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలన్నీ భూ కేటాయింపుల కోసమే జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. దోచిపెట్టడం తప్ప ఈ 16 నెలల్లో జరిగిన అభివృద్ది శూన్యం. నకిలీ లిక్కర్, కురుపాంలో విద్యార్థినుల మృతి ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించాలి.