విశాఖపట్నం: రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటంతోపాటు చట్టాలను అతిక్రమిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆరోపించారు. విశాఖ లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సృష్టి ఫౌండేషన్‌తో తనకి సంబంధం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హైకోర్టుకి తప్పుడు అఫిడవిట్ సమర్పించాడని, వాస్తవానికి దాన్ని నిర్మిస్తున్న శివ్ ఫౌండేషన్ తన కోడలికి చెందినదేనని ఆయన ఆధారాలు చూపించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తండ్రీకొడుకులు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి తండ్రీకొడుకులు నర్సీపట్నంలో యథేచ్ఛగా లేటరైట్, క్వారీల దందా చేస్తున్నారని, ఇప్పటికే రూ. 500 కోట్లు కొట్టేశారని, రూ. 100 కోట్ల విలువైన 30 ఎకరాల దేవాదాయశాఖ భూములను కాజేశారని ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న మాపై దాడి చేసిందే కాకుండా మా నాయకులపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తండ్రీకొడుకులు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కుమిలి కుమిలి ఏడవక తప్పదని హెచ్చరించారు. వారు చేసిన అక్రమాలు, అరాచకాలను కోర్టు ముందు నిరూపించి శిక్షించి తీరుతామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు. - స్పీకర్‌కి హైకోర్టు తీర్పంటే లెక్కేలేదు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా అప్రజాస్వామ్య, అనైతిక విధానాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కలిసి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్నారు. నర్సీపట్నం పెద్ద చెరువులో విగ్రహాలు పెట్టే పేరుతో భూమి పూజ చేసి చెరువును కబ్జా చేసే కుట్రలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతూ నా వద్దకు రావడం జరిగింది. దీంతో రైతుల పక్షాన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఎలాంటి స్పదనా లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించా. కోర్టు అనుమతులు తీసుకోకుండా చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ సాక్షాత్తూ హైకోర్టు తీర్పు చెప్పినా స్పీకర్ లెక్కచేయడం లేదు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ నిర్మాణాలు చేపడుతున్నారని మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. గత నెల 27వ తేదీన అక్రమ నిర్మాణాల విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వీడియోలు తీస్తుండగా టీడీపీ గూండాలు మాపై దాడి చేయడంతోపాటు మా వాహనాలను ధ్వంసం చేశారు. మాపై దాడి చేసి మా కారు ధ్వంసం చేయడమే కాకుండా వాళ్లను మనుషులను కొట్టినట్టు మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేయించారు. - మాపై దాడి చేసి మావారిపైనే అక్రమ కేసులు నర్సీపట్నం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని దుష్టసాంప్రదాయానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు తెరదీశారు. మాపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో మరోసారి పోలీసులను ప్రలోభపెట్టి సెక్షన్లను నాన్ బెయిలబుల్ కిందకు మార్చేశారు. ఈ సంఘటనలో మేం దాడి చేశామని పోలీసులకు ఫిర్యాదు చేసిన రమణ, 27వ తేదీన కాళ్లూ చేతులతో కొట్టామని చెప్పాడు. అదే వ్యక్తి మాట మార్చి 30వ తేదీన రాళ్లు కర్రలతో కొట్టి గాయపరిచినట్టు స్టేట్‌మెంట్‌ను మార్చి కేసును నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కిందకు మార్చేశారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చనే అహంకారంతో తండ్రీకొడుకులు రెచ్చిపోతున్నారు. తన మనుషులను వారే కొట్టి వారే ఆస్పత్రిలో చేర్చి సర్జరీల పేరుతో రిపోర్టులు తీసుకొచ్చి మాపై దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. స్పీకర్ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి కూడా కోర్టులనే మోసం చేసే స్థాయికి తెగించారు. - హైకోర్టుకి స్పీకర్ అయ్యన్న తప్పుడు అఫిడవిట్ సృష్టి క్షేత్రానికి తనకీ ఏం సంబంధం లేదని, శివ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని, తనను కేవలం ఛీఫ్ గెస్టుగా పిలిస్తే వెళ్లానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చి న్యాయస్థానాన్నే మోసం చేశాడు. తన పెద్ద కొడుకు భార్య (స్పీకర్ కోడలు) పేరు మీదున్న శివ్ ఫౌండేషన్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తూ తనకి సంబంధం లేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి నిజంగా దైవ క్షేత్రం కట్టాలని ఉంటే పక్కనే 300 మీటర్ల దూరంలో వందలాది ఏళ్లుగా ఉన్న బలిగట్టం ప్రాంతంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. చేతనైతే వాటిని డెవలప్ చేసి చూపించాలి. వైయస్ఆర్‌సీపీ నుంచి మేం కూడా సహకారం అందిస్తాం. అంతేకానీ సృష్టిక్షేత్రం పేరుతో రైతుల జీవితాలను పణంగా పెడతామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. చెరువులో నీటిని తీసేసి ఎండబెట్టి రైతులకు ఉపాధి లేకుండా చేయడం తగదు. నా మీద కోపం ఉంటే నన్ను జైల్లో పెట్టించాలే కానీ నా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. - అనకాపల్లి కలెక్టర్ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? కోర్టు ఉత్తర్వులపై కలెక్టర్ సహా ఇతర రెవెన్యూ అధికారులు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నియమనిబంధనలకు అనుగుణంగా పనిచేసిన వారు, నేడు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉత్తర్వులును సైతం యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాతవరం మండలం గుమ్మిడిగొండ అనే గ్రామంలో తాండవ కాలువ పక్కన నల్లకొండమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించాలని రైతులు ప్రయత్నిస్తే, ఓల్టా చట్టానికి వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ నాడు అయ్యన్నపాత్రుడు కోర్టుల ద్వారా నిర్మాణాలను అడ్డుకున్నాడు. అయినా గ్రామస్తులు హైకోర్టును తీర్పుకి వ్యతిరేకంగా నిర్మాణం చేపడితే నాటి కలెక్టర్ తోపాటు ఉన్నత స్థాయి అధికారులంతా గ్రామాన్ని సందర్శించి నిర్మాణం జరగకుండా ఆపేశారు. నాలుగు రోజులపాటు గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కానీ, అదే అధికారులు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్‌ను సైతం లెక్కచేయకుండా నిర్మాణలు చేస్తున్నా చోద్యం చూస్తున్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ఆచరణలో పెట్టాల్సిన అధికారులే యథేచ్ఛగా ఉల్లంఘించడం సిగ్గుచేటు. - అయ్యన్న తండ్రీకొడుకుల లేటరైట్ దందా రూ. 500 కోట్లు అయ్యన్నపాత్రుడు తన కొడుక్కి రాజ్యసభ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అమరావతిలో యువనేతకు లంచాలచ్చి పదవిని తెచ్చుకోవడం కోసం ఇక్కడ అక్రమ సంపాదనకు డోర్లు బార్లా తెరిచాడు. తండ్రీ కొడుకులు రెండేళ్లలో రూ.500 కోట్లు లేటరైట్ మీద సంపాదించారు. ఏపీ ట్యాక్స్ (అయ్యన్నపాత్రుడు) పేరుతో క్వారీలను కొల్లగొడుతున్నారు. ఆన్‌రాక్ ఫ్యాక్టరీ యాజమాన్యం వీళ్ల దగ్గరకు రాలేదన్న కోపంతో 40 టన్నులకు మించిన లారీలు రాకూడదని ఎక్కడికక్కడ బ్రిడ్జిల మీద బోర్డులు, ఆర్టీవో, పోలీస్ చెక్‌పోస్టులు పెట్టించి నాలుగు నెలలు అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే అవేవీ కనిపించడం లేదు. అంతకుముందు వరకు కమీషన్లు చెల్లించిన లారీలు 60 టన్నులతో వెళ్లినా పట్టించుకోలేదు. తర్వాత ఆన్‌రాక్ నుంచి కమీషన్లు తీసుకుని వారిని కూడా వదిలేశారు. వంద కోట్లు విలువ చేసే 30 ఎకరాల దేవాదాయ భూములను ఇప్పటికే దోచేశారు. సోలార్ పేరుతో కనీసం టెండర్లు లేకుండా 30 ఏళ్లు లీజుకి తీసుకున్నారు. పక్కనే మరో 70 ఎకరాలకు కూడా స్కెచ్ వేశాడు. ఇప్పటికే వంద కోట్లు కొల్లగొట్టిన తండ్రీకొడుకులు మరో రూ. 300 కోట్ల దోపిడీకి భారీ స్కెచ్ వేశారు. విశాఖపట్నంకి చెందిన ఒక వ్యాపారి లేటరైట్ వర్కులు చేసుకోవడానికి స్పీకర్ దగ్గరకు వెళితే అమరావతిలో యువనాయకుడికి కప్పం కట్టాలని చెప్పి రూ. 20 కోట్లు డిమాండ్ చేశారు. అడ్వాన్సు కింద రూ. 6 కోట్లు వసూలు చేసిందే కాకుండా నెల రోజులు పోయాక డబ్బులిచ్చిన వ్యాపారి మీదనే క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. యువ నాయకుడి పేరు చెప్పి ప్రజా సంపదను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. సృష్టి క్షేత్రం అనే బ్యానర్ ముసుగులో తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడం కోసం వందేళ్ల చరిత్ర కలిగిన చెరువులో స్పీకర్ అక్రమ నిర్మాణాలు చేయిస్తున్నారు. - రాబోయే రోజుల్లో కుమిలి కుమిలి ఏడుస్తారు వైయస్ జగన్ గారిని చూసి అయ్యన్నపాత్రుడికి వెన్నులో వణుకుపుడుతోంది. ఆయన్ను తిట్టడానికే మహానాడుని పెట్టుకున్నట్టుగా ఉంది. రెండేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పడానికి ఏదీ లేక మా నాయకుడి గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారు. చేయని తప్పుకి వైయస్ఆర్‌సీపీ నాయకులను అన్యాయంగా జైలుకు పంపించారు. ఏ సంబంధం లేకపోయినా మా నాయకులను వారం రోజులపాటు జైల్లో పెట్టి వారి కుటుంబాలను మానసిక వేదనకు గురిచేశారు. ఇప్పటికైనా తండ్రీకొడుకులు అరాచకాలను ఆపకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు. తమ చేతిలో అధికారం, డబ్బు ఉందన్న అహంకారంతో బరితెగించి వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మేం కూడా మీలాగే చేస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నా. మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, తప్పులకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు. ఆరోజు ఎందుకలా చేశామా అని మీలో మీరే మదనపడే రోజు వస్తుందని ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. తండ్రీకొడుకులను చట్టప్రకారం శిక్షించే దాకా వదిలే ప్రసక్తే లేదు. ఈ తండ్రీకొడుకుల అత్యుత్సాహం, అహంకారం కారణంగా మాకీ పరిస్థితి దాపురించిందని వారి అనుచరులు సైతం మదనపడే రోజు తీసుకురాకుండా ఊరుకునేది ఉండదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ హెచ్చరించారు.