విజయవాడ: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాలు విసిరారు. గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు శాసనం అని చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా..? 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్తే ప్రజలు పవన్‌ను గేటు కూడా తాకనివ్వలేదని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వారాలబ్బాయి అంటూ ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ నిలబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన నువ్వు ముఖ్యమంత్రిని విమర్శించడమా..? నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పవర్ లేని స్టార్.. అంటూ ఎద్దేవా చేశారు. కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ ఖాళీ అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంటూ ఆరోపణలు గుప్పించారు.
పవన్ కల్యాణ్‌ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరని వెల్లంపల్లి అన్నారు. పవన్ కల్యాణ్ రద్దైన నోట్లతో సమానం అనే సంచనల వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీయార్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతీ సచివాలయానికి ముగ్గురు ఇంచార్జీల నియామకం చేపడతామని, ప్రభుత్వం చేపట్టే మంచిని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.