శ్రీకాకుళం: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదల పాలిట సంజీవనిగా ఉపయోగపడిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ పథకాన్ని కూటమి సర్కార్ స్కామ్‌గా మార్చిందని మండిపడ్డారు. దేశంలోనే ఒక బృహత్తరమైన పథకం ఆరోగ్యశ్రీ పథకం, అలాంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. శనివారం సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు భీమా కంపెనీలకు మేలు చేసేందుకే.. ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్ లోకి మార్చబోతున్నామంటూ నిన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఏమి మేలు జరగదు... ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.2500 కోట్లు ఆరోగ్య శ్రీ కోసం ఖర్చు పెట్టిందని మాజీ మంత్రి సీదిరి గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పినదాని ప్రకారం సంవత్సరానికి రూ.3500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది . అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు పైనే ప్రైవేటు భీమా కంపెనీలకు మేలు చేసేందుకే ఈ కుట్ర పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రూ.5800 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రజల సొమ్మును దోచు పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబు సొంత మనుషుల జేబులు నింపుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకంపై కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు జేబులు నింపుకోవడమే సంపద సృష్టి అన్నారు. ఈ ఆరు నెలల్లో లక్షా ,20 వేల కోట్లు రూపాయలు చంద్రబాబు అప్పు చేశారు. ఈ డబ్బులు ఏం చేశారన్నది ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు. పవన్ ప్రశ్నించాలి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని సీదిరి అప్పలరాజు సూచించారు. ఈ హైబ్రిడ్ మోడల్లోకి వెళ్తే ప్రజలకు మేలు జరగదన్న విషయాన్ని డిప్యూటీ సీఎం చర్చించాలన్నారు. జీతాలు,పెన్షన్లు ఇవ్వడం తప్ప ఈ ఆరు నెలల్లో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా..? అని నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులు గాని కంపెనీలు గాని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషి వల్ల మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్ చేసిన మంచి పనులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారని సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు.