తాడేపల్లి: రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. మచిలీపట్నంలో తన సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోదాము నుంచి బియ్యం షార్టేజీ వచ్చిందనే అంశాన్ని సాకుగా చూపి.. తనతో పాటు తన భార్య, కుమారుడిని కూడా.. అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని ఆయన ఆరోపించారు. బియ్యం షార్టేజీ విషయంలో తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రభుత్వ దర్యాప్తును మించి టీడీపీ అనుకూల సోషల్ మీడియా అత్యుత్సాహంతో ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు. మేమే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం: మచిలీపట్నంలో నా సతీమణి జయసుధకు చెందిన గోదాంను రెండేళ్ల క్రితం పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చాం. దానిలో నిల్వ చేసిన బియ్యంలో షార్టేజీ వచ్చిందని గత నవంబరు 25న గోదాం మేనేజర్ నా సతీమణి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే బాధ్యతగా ఆమె పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 5 రోజులకు గోదాం మేనేజర్, ఇదే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఒక వినతిపత్రం కూడా ఇచ్చారు. షార్టేజీ వచ్చిన బియ్యంకు సంబంధించి ప్రభుత్వం నిర్దారించిన విలువను చెల్లిస్తాం లేదా ఓపెన్ మార్కెట్‌లో అంత బియ్యం కొనుగోలు చేసి ఇస్తామని ఆ వినతిపత్రంలో స్పష్టం చేశాం. ఆ తర్వాత ఈనెల 4న జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోదాం సందర్శించి, బియ్యం నిల్వలను తనిఖీ చేసి, ఆ శాఖ వీసీ అండ్ ఎండీకి నివేదిక ఇచ్చారు. ఆ క్రమంలో బియ్యం షార్టేజీపై చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 10న వీసీ అండ్ ఎండీ నుంచి డిఎస్‌ఓకు ఆదేశాలు వచ్చాయి. షార్టేజీ అయిన బియ్యంకు సంబంధించిన విలువను గోదాం యాజమాన్యం నుంచి వసూలు చేయడంతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వీసీ అండ్ ఎండీ ఆదేశించారు. ఆ మేరకు డీఎస్‌ఓ ఫిర్యాదుతో నా సతీమణి జయసుధ, గోదాం మేనేజర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గంట వ్యవధిలోనే సొమ్ము జమ చేయమన్నా.. చేశాం: మరోవైపు ఈనెల 13న గోదాం వద్దకు వచ్చిన పౌర సరఫరాల అధికారులు, 10వ తేదీ సంతకంతో జాయింట్ కలెక్టర్ జారీ చేసిన నోటీస్‌ను అంటించి వెళ్ళారు. గోదాములో 3708 బస్తాల బియ్యం షార్టేజీ తేలిందని, దీనికి గానూ రూ.1,70,50,800 ను మూడు రోజుల్లో జమ చేయాలని పేర్కొన్నారు. అంటే మా గోదాంకు నోటీస్ అంటించిన వెంటనే మేము ఆ నగదు జమ చేసేలా కుట్ర చేస్తూ, 10వ తేదీన సంతకం చేసిన నోటీస్‌ను, కేవలం 3 రోజుల టైమ్ ఇస్తూ.. 13వ తేదీన గోదాంకు అంటించి వెళ్లారు. అంటే 13వ తేదీ మధ్యాహ్నం నోటీస్ అంటించగానే, కేవలం గంట వ్యవధిలో, బ్యాంక్ వేళలు ముగిసే సమయానికి మేం ఆ సొమ్ము జమ చేశాం. మాపై కేసులు నమోదు చేయాలనే కుట్రతోనే అధికార యంత్రాంగంతో ఆ విథంగా పని చేయించారు. ప్రభుత్వానికి ఆ సొమ్ము జమ చేసిన తర్వాత, జిల్లా జేసీకి నా శ్రీమతి జయసుధ తరుఫున న్యాయవాది ఒక లేఖను కూడా అందచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాన్ని గౌరవించి, చాలా వేగంగా సొమ్ము జమ చేశామని.. అంతే కానీ ఆ నోటీస్‌లో తమపై చేసిన అభియోగాలు అంగీకరించడం లేదని ఆ వినతిపత్రంలో స్పష్టం చేశాం. మా అరెస్ట్‌లకు మంత్రి ఒత్తిడి: నా సతీమణిపైన నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం న్యాయస్థానంలో ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ను అందుబాటులో లేకుండా చేయడం ద్వారా పదేపదే వాయిదాలు తీసుకున్నారు. మరోవైపు బియ్యం వ్యవహారంలో నేను పరారైనట్లుగా టీడీపీకి వంత పాడే ఎల్లో మీడియా, సోషల్ మీడియాల్లో ఇష్టారాజ్యంగా విష ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి ఏకంగా నన్ను దొంగగా అభివర్ణించారు. ఏ ఆధారాలతో నాపై దొంగతనం నింద మోపారో ఆ మంత్రి స్పష్టం చేయాలి. ఇంకా రాజకీయంగా కక్ష సాధించేందుకు నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేసేందుకు సదరు మంత్రి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి మనోహర్‌కు చిత్తశుద్ధి ఉంటే..: పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చిత్తశుద్ది ఉంటే నేను అడిగిన సమాచారం ఇవ్వాలి. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయిస్ వీసీ ఎండీకి కూడా లేఖ రాస్తున్నాను. 2014–15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేసిన తరువాత ఎన్ని నెలలకు బియ్యంను సివిల్ సప్లయిస్ విభాగానికి అందించారు?. సకాలంలో అలా అందించని వారు ఎందరు?. వారిపైన ఎంత జరిమానా విధించారు?. ఎంత మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు?. ఆ వివరాలు ఇవ్వాలి. ఇంకా రైస్ మిల్లులు ఆ బియ్యాన్ని మీకు అప్పగించకుండా ఉంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు ఆ మిల్లులకు ధాన్యం వెళ్ళింది? వారి మిల్లులో ఉంచిన బియ్యం ఎప్పుడెప్పుడు బఫర్ గోడవున్ కు వచ్చింది? ఆ వివరాలు కూడా ఇవ్వాలి. అలాగే సకాలంలో బియ్యం ఇవ్వని మిల్లులకు చెందిన బ్యాంక్ గ్యారెంటీలను వసూలు చేశారా? క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారా? ఎగ్గొట్టిన వారిపై ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు?. అలాగే ప్రభుత్వ అధీకృత గోదాముల్లో, రేషన్ షాపుల్లో బియ్యం షార్టేజీ వస్తే డబ్బులు వసూలు చేసిన తరువాత కూడా ఏ అధికారి మీద అయినా కేసు కట్టారా?.. ఈ మొత్తం సమాచారం ఇవ్వాలని వీసీ ఎండీని కోరుతున్నాను. అలాగే మంత్రి మనోహర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే ఈ వివరాలు ఇప్పించాలి. గతంలో ఏం చేశారు?: 2017 జూలైలో మచిలీపట్నం సెంట్రల వేర్ హౌజ్‌లో 100 టన్నుల బియ్యం షార్టేజీ వస్తే అధికారులు డబ్బు కట్టించుకున్నారు. అంతే కానీ ఎవరి మీద కేసు నమోదు చేయలేదు. 2017–18లో ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న ఒకరి రైస్ మిల్లులో ధాన్యం సరఫరా చేసిన తరువాత ఏడాది అయినా కూడా బియ్యం ఇవ్వలేదు. దీనిపై ఆనాటి జాయింట్ కలెక్టర్ ఆ మంత్రికి చెందిన బ్యాంక్ గ్యారెంటీలను నగదుగా జమ చేసుకున్నారు. దీనిపై ఆ మంత్రిపై కేసు ఎందుకు వేయలేదు?. దీనికి వీసీ ఎండీ సమాధానం చెప్పాలి. కేజీ బియ్యానికి రూ.94 చొప్పున చెల్లించాం: ‘బియ్యం అమ్మేసుకున్నాం. అవినీతికి పాల్పడ్డాం’. అని మాపై దారుణ ఆరోపణలు చేస్తున్నారు. రూ.40కి ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రేషన్ షాప్‌ల నుంచి మాఫియా రూ.20 రవాణాతో సహా కొనుగోలు చేస్తున్నారని మంత్రి మనోహర్ మాట్లాడారు. అంటే మార్కెట్‌లో కేజీ బియ్యం రూ.20 ఉంటే, మేము గోదాంలో షార్టేజ్ అయిన బియ్యానికి కేజీ రూ.94 చొప్పున చెల్లించాం. అయినా స్థానిక మంత్రి ప్రోద్భలంతోనే మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మమ్మల్ని అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నారు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా..: ‘దైవం కంటే ఎక్కువగా నేను భావించే, చనిపోయిన నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఏ తప్పు చేయలేదు’.. అని పేర్ని నాని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసి, కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు.