గుంటూరు: వైయస్ జగన్ అంటే తగ్గేదేలే..సోనియాకే భయపడలేదు..దుష్ట చతుష్టయానికి భయపడతారా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు.. దుష్టచతుష్టయం కలిసి మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. నలుగురు దొంగల కథ: ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్థంభంగా చెప్పుకునే పత్రికాలోకం కుల ఉన్మాదం, మీడియా దుర్మార్గ పోకడ గురించి మాట్లాడుకోవాల్పి వస్తోంది. దానికి కారణం నలుగురే నలుగురు. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. ఒక అయ్యగారు తన భుజంపై ఒక మేకపిల్లను తీసుకువెళ్తుంటే.. నలుగురు దొంగలు కలిసి.. మొదటి దొంగ చంద్రబాబు అయితే, రెండో దొంగ ఈనాడు రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో పిల్ల దొంగ బీఆర్ నాయుడు.. ఈ నలుగురూ కలిసి.. అయ్యగారు మీ భుజంపై ఉన్నది మేకపిల్ల కాదు కుక్కపిల్ల అని పదే పదే చెప్పడంతో.. నిజంగానే తనకు రాజుగారు మేకపిల్లకు బదులు కుక్కపిల్లను ఇచ్చాడనుకుని వదిలేస్తే.. ఆ నలుగురు దొంగలు మేకను వండుకు తిన్నారు. నీతిసూత్రంలో ఉన్న ఆ కధ గురించి మనమంతా విన్నాం. ఇవాళ మేకపిల్ల వంటి ఆం«ధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అయ్యగారు అయినటు వంటి రాష్ట్ర ప్రజలందరికీ కట్టుకధలు చెప్పి, ఆ అధికారాన్ని అప్పనంగా నలుగురు దొంగలు పంచుకునే ప్రయత్నం జరుగుతుంటే, ఆ అయ్యగారు అమాయకుడు కావచ్చు కానీ, ఇక్కడ ఉన్న మన నాయకుడు ఈ నలుగురు దొంగలకు బుద్ది చెప్పి పంపే ధైర్యశాలి. దుర్మార్గమైన ఆలోచన: వారందరికీ కావాల్సింది ఒకటే. తమ వాడే అధికారంలో ఉండాలి. ఆయన కూడా చెప్పుచేతల్లో ఉండాలనే దుర్మార్గమైన ఆలోచన. ఎన్టీఆర్‌ను కూడా మనోడు అనుకుని సమర్థించారు. కానీ ఆయన నిఖార్సయిన వ్యక్తి కావడంతో, నిందలు వేసి, దుష్ప్రచారం చేసి పదవీచ్యుతిడిని చేశారు. అందుకే రామోజీరావు నమ్మకద్రోహి అని చనిపోయే ముందు ఎన్టీఆర్ చెప్పారు. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు ముగ్గురికీ కావాల్సింది.. పదవిలో తమ వాడుండాలి. తమ చెప్పుచేతల్లో ఉండాలి. అందుకే ఇవాళ ఈ గోలలు. విషం చిమ్మే కార్యక్రమాలు. అందుకే ‘సాక్షి’ రాక: మీడియా వ్యవస్థకు పట్టిన చీడ పారదోలడానికి ఒక ఉదయం, ఒక వార్త పుట్టినా వాటిని పీక పిసికి చంపే వరకు వారు నిద్ర పోలేదు. రాజశేఖర్‌రెడ్డిగారి పాలన మీద కూడా నీచంగా రాతలు రాస్తుంటే, వాటిని తిప్పి కొట్టే ప్రయత్నంలో భాగంగానే, జగన్‌గారి ఆలోచన మేరకు, రాజశేఖర్‌రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలకు నిజాలు చెప్పడం కోసమే సాక్షి పత్రిక పుట్టింది. సాక్షి ఉద్భవానికి కేవలం ఈ దుర్మార్గుల రాక్షసక్రీడనే కారణం. ప్రజలకు నిజం చెప్పడం కోసమే సాక్షి పత్రిక పుట్టింది. స్వప్రయోజనాలే వారి లక్ష్యం: పాలకులను గుప్పిట్లో పెట్టుకుని, స్వప్రయోజనాల కోసం పని చేయడం రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు పని. పరిపాలన తమ గుప్పిట్లో ఉండాలని, తమ మాట చలామణి కావాలనేది వారి లక్ష్యం. అందుకే తమకు గిట్టని ప్రభుత్వంపై విషం చిమ్మడం వారికి అలవాటు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో నాడు ఈనాడులో రాశారు. ‘పెద్దలా గద్దలా’ అని పెద్ద వార్త రామోజీరావు రాశారు. అయితే చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్డు తానే కట్టానంటాడు. అలా అయితే భూసేకరణ రాజశేఖర్‌రెడ్డిగారు ఎందుకు చేశారు? నిజానికి ఆ రోడ్డు నిర్మించింది ఆయనే. అయినా చంద్రబాబు పచ్చిగా అసత్యాలు చెబుతున్నారు. వాటిని ఎల్లో మీడియాలో రాస్తున్నారు. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడుకు కుల ఉన్మాదం. ఎన్టీఆర్ తమ కులస్తుడే అయినా, చెప్పుచేతల్లో లేడు కాబట్టి అవసరం లేదు. అందుకే తమ కులస్తుడైనా సరే, తమ ఆర్థిక అభివృద్ధి కోసం పని చేయకపోతే అవసరం ఉండదు. వారికి చంద్రబాబు చౌదరి వంటి తొత్తు కావాలి. రాజశేఖర్‌రెడ్డిగారు రెండోసారి గెలవకుండా ఎన్నో కుట్రలు చేశారు. కానీ ఆయనను ఈ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి, ఎన్ని కుతంత్రాలు చేసినా ఆయనను గెలిపించారు. మళ్లీ సీఎంను చేశారు. ఒక ఉదాహరణ: చంద్రబాబు వస్తే రాధాకృష్ణకు ఎంత లాభమో ఒక ఉదాహరణ చెబుతాను. ఇబ్రహీంపట్నం వద్ద వంతెన దాటగానే ఎడమ పక్కన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అది నడుస్తుంది. లేకపోతే మూత పడుతుంది. ఆ పవర్ ప్లాంట్ ద్వారా రాధాకృష్ణకు ఆదాయం వస్తుంది. ఆ కిటికీ గుండా రాధాకృష్ణకు చంద్రబాబు దోచి పెడుతున్నాడు. ఆ డబ్బు కోసం రాధాకృష్ణ చేయని నీతిమాలిన పని లేదు. అంత దారుణ రాతలా?: మన మాతృ సమానురాలు విజయమ్మ నిన్న ఎంతో హుందాగా, గొప్పగా, పారదర్శకంగా మాట్లాడితే ఇవాళ ఎంత విషం చిమ్మారు? మనిషి జన్మ ఎత్తిన వారు అంత దారుణంగా రాస్తారా? విజయమ్మగారు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత, ఒక కాగితం చూడకుండా, తన మనసులోని మాటను అంత చక్కగా చెబితే, ఇవాళ ఆ పత్రికలో ఎంత కిరాతకంగా రాశారు. మనిషి అనేవాడు అంత దారుణంగా రాస్తాడా? అనిపించింది. పాపపు సొమ్ముతో సుఖపడగలరా: మహేష్‌బాబు డైలాగ్ ఒకటుంది. అదే నేను అడుగుతున్నాను. ఇంత తప్పుడు వార్తలు, నీచపు రాతలు రాసి రాధాకృష్ణ.. చంద్రబాబు నుంచి నాలుగు మూటలు తీసుకెళ్తారేమో కానీ, మీ ఇంట్లో భార్యా పిల్లలు సుఖశాంతులతో ఉంటారా? ఆ పాపపు సొమ్ము ఎందుకు? ఎవరి కోసం? ఎన్ని కార్లు కావాలి? టక్కు వేసుకుని నాలుగు నీతి కబుర్లు చెబితే సరిపోదు రాధాకృష్ణగారు. నీవు 10 మందికి చెప్పే మాటలు ఆచరించాలి. అందుకోసం నీవు చంద్రబాబు స్కూల్ వదిలేయాలి. జగన్‌గారిని చూసి నేర్చుకోవాలి. సిగ్గు శరం కూడా లేకుండా..: గతంలో రాజశేఖర్‌రెడ్డిగారు ఉండగా, రామోజీరావు ఒక స్లో పాయిజన్‌లా, షుగర్ కోటింగ్‌తో వార్తలు రాసేవాడు. కానీ ఇప్పుడు సిగ్గు, శరం అన్నీ వదిలేశాడు. చివరకు హెడ్‌లైన్‌తో సహా, అన్నీ అబద్ధాలు రాస్తున్నాడు. ఇటీవలే విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకు జగన్‌గారు ఉరేశాడని రాశాడు. నిజానికి అసలు రోడ్డే లేదు. దాన్ని మ్యాప్‌లో ఎక్కడెక్కడో చూపారు. అదే జగన్‌గారు ఇప్పుడు విజయవాడ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తున్నాడు. అవుటుపల్లి నుంచి గొల్లపూడి మీదుగా కాజా వరకు అమరావతి మధ్య నుంచి రింగ్ రోడ్డు నిర్మిస్తున్నాడు. రేపు దాన్ని ప్రారంభిస్తాడు. ఇంకా ఆ రోడ్డును కాజా టోల్‌గేటుతో ఆపకుండా పెనమలూరు, ఉయ్యూరు, చోడవరం మీదుగా కృష్ణా నది దాటించి మళ్లీ గన్నవరం కలిపే ప్రయత్నం చేస్తుంటే, రామోజీరావు రాశాడు.. జగన్‌గారు ఔటర్ రింగ్ రోడ్డుకు ఉరేశాడని. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎప్పుడు రామోజీని కలిసినా బూట్లు విప్పి వెళ్తాడు. అప్పుడు ఆయన చంద్రబాబుకు చెప్పి ఉండాలి కదా? ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించమని. దుష్ట చతుష్టయాన్ని అడుగుతున్నాను: జగన్‌గారు వచ్చాక ఉప్పు, పప్పు ధరలు పెరిగాయట. ఇంకా నలుగురు దొంగల్లో ఒకరైన చంద్రబాబు అంటారు.. భారతి సిమెంట్ రేట్లు పెంచడం కోసమే అన్ని ధరలు పెంచుతున్నారని. ఏ మాత్రం సిగ్గు లేని దుష్ట చతుష్టయాన్ని నేను అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో కందిపప్పు రేటు ఎంత? నీ హెరిటేజ్ షాప్‌లో ఎంత ధర? హైదరాబాద్‌లో ఉన్న ధరలే ఇక్కడా ఉండాలి కదా?. చంద్రబాబు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ హెరిటేజ్ షాప్‌లో తక్కువ ధరకు అమ్మొచ్చు కదా? ఒడిషా, తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగానే రేట్లు ఉన్నాయి కదా? మరి ఆ రెండు చోట్లా జగన్‌గారే పాలిస్తున్నారా? ఎంత దుర్మార్గం. ప్రజలకు వివరంగా చెప్పాలి: అన్నీ విషపు రాతలు. రాత్రంతా నలుగురు విషం తయారు చేసుకోవడం. తెల్లారేసరికి అచ్చు గుద్దేయడం. అంత ఉన్మాదం వారిది. వెంటనే జగన్‌గారిని తోసేయాలి. మనోడు వచ్చేయాలి. చంద్రబాబు పాలన ఒక స్వర్ణయుగం అన్నట్లు రాస్తున్నారు. రోడ్లపై రత్నాలు రాశులు పోసి అమ్మినట్లు రాస్తున్నారు. అందుకే ఈ విషపు రాతలు, దుష్ట చతుష్టయం చేసే పనులను ప్రజలకు చెప్పాలి. కట్ట కట్టుకుని రండి: పవన్‌కళ్యాణ్ నువ్వు సింగిల్‌గా రా. చంద్రబాబు నువ్వు సింగిల్‌గా రా అంటున్నాం. వారికి తెలియదా. సింగిల్‌గా వస్తే. చితకొట్టి పంపిస్తారని. అందుకే మనం ఏమనాలి? రండిరా బాబు కట్ట కట్టుకుని రమ్మని. అప్పుడు జగన్‌గారు పొట్లం కట్టి పంపిస్తారు. ఇక్కడ జగన్‌గారు ఒక సింహం. చంద్రబాబు మాదిరిగా ఏ గడ్డి పడితే అది తినడు. ఆయన రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ కొడుకు. ఎంతో ధైర్యవంతుడు. కాబట్టి ఒకడొకడు కాకుండా, అందరూ కలిసి వస్తే, ఒకేసారి కొడతాడు అని చెబుతున్నాం. చెత్త పేపర్లను పట్టించుకోవద్దు: ఒకటే గుర్తు పెట్టుకొండి. జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు చెబుతున్నాను. మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. జగన్‌గారి సుపరిపాలనతో రాష్ట్రంలో కోట్లాది కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. కాబట్టి చెత్త పేపర్లను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్‌గారి వెంట లక్షలాది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి. అంటే కల్లంలో వడ్లు ఉన్నాయి. వాటిని బస్తాల్లో తెచ్చుకోవడమే మన పని. జగన్‌గారినే నమ్ముకొండి: చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు. మూడేళ్లైంది. మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని. అధికారమంతా ఎమ్మెల్యేల దగ్గరే ఉందని. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. నేను ఎవర్ని? జగన్‌గారు ఒక బి–ఫామ్ ఇస్తే, దాన్ని ఆర్డీఓ ఆఫీస్‌లో ఇస్తే, జగన్‌గారి ముఖం చూసి ఓట్లు గుద్దారు. పదవి వచ్చింది. అందుకే మీరు నా వంటి వారి కోసం కాకుండా, జగన్‌గారి కోసం పని చేయండి. ఎందుకంటే ఆయనే శాశ్వతం. మా మంత్రి పదవులు కాదు. అలాగే ఎమ్మెల్యే పదవులూ శాశ్వతం కావు. మరి ఎవరు శాశ్వతం? జెండా మోసే పార్టీ కార్యకర్తలే శాశ్వతం. అందుకే అందరూ కాస్త ఓపిగ్గా ఉండాలి. జగన్ అంటే తగ్గేదేలే..: నీవు ఎవరి మనిషివి? జగన్ మనిషివి. ఆయనకు ఉన్న లక్షణం ఏమిటి? భూదేవికి ఉన్నంత సహనం. అది లేకపోతే, ఆయనకు ఆత్మస్థైర్యం లేకపోతే, ఒక దుర్మార్గురాలు దేశంలో రాజకీయ నాయకులను గడగడలాడిస్తే, చంద్రబాబుతో కుట్రలు చేసి, 16 నెలలు జైలులో పెట్టినా తగ్గలేదు. జగన్ అంటే తగ్గేదేలే.. సోనియా వంటి మహా నాయకురాలికే ఆయన భయపడలేదు. ఇక చంద్రబాబు ఎంత? ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ ఎంత? ఎవరిని భయపెడతారు మీరు? ఇకనైనా మీ కుట్రలు మానండి. ధర్మంగా నడిస్తే, మీ ఇంట్లో భార్యాపిల్లలు సంతోషంగా ఉంటారు. మీరు తప్పుడు రాతలు రాసి, డబ్బు సంచులు తీసుకుపోయినా, ఇంట్లో వారికి సుఖశాంతులు ఉండవు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత: అందుకే మరోసారి కార్యకర్తలకు చెబుతున్నాను. మీరు మంత్రులు, ఎమ్మెల్యేలను కాకుండా, జగన్‌గారిని నమ్మండి. పార్టీ జెండాను గట్టిగా నమ్ముకొండి. ఆయన చంద్రబాబు మాదిరిగా ఎవరికి పడితే వారికి, తప్పుడు చేసిన వారికి టికెట్లు ఇవ్వరు. జనంలో బాగుంటే, కార్యకర్తల గుండెల్లో ఎవరుంటే వారికే టికెట్ ఇస్తారు. అందుకే పార్టీ జెండాను గట్టిగా నమ్ముకొండి. జగన్‌గారు చెప్పే మాటలు వినండి. ఇంటికి వెళ్లి తూచ తప్పకుండా పాటించండి. మరోసారి చెబుతున్నాను. జగన్‌గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇక్కడ మరో విషయం గుర్తుకు చేస్తున్నాను. 2004, 2009లో రాజశేఖర్‌రెడ్డిగారు గెల్చారు. అప్పుడు ఓడిపోయిన వారెవరో గుర్తున్నారా? అలాగే 2019లో అఖండ విజయం సాధించి, మరోసారి 2024లో గెలవబోతున్న వారెవరో తెలుసుకదా? అలా అప్పుడు తండ్రి చేతిలో, ఇప్పుడు కొడుకు చేతిలో ఓడిపోతున్నది ఎవరనేది తెలుసుకోవడానికి కట్ట చుట్టూ గిన్నిస్ బుక్ వారు తిరుగుతున్నారట.. అంటూ మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని ప్రసంగం ముగించారు.