తాడేపల్లి: కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, మంత్రి నారా లోకేష్ ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మొత్తం రాజకీయ జీవితంలో ఏనాడు విద్య పట్ల సానకూల దృక్పథంతో వ్యవహరించలేదని మండిపడ్డారు. స్వాతంత్రం వచ్చిన తరువాత తొలిసారిగా రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంస్కరణలను వైయస్ జగన్ గారు తీసుకువస్తే వాటిని కూడా సమూలంగా నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అసమర్థత వల్ల మొత్తం వ్యవస్థే దెబ్బతింటోంది. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. వైయస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం, ఐబీ, సీబీఎస్‌సీ సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, డిజిటల్ క్లాస్ రూమ్‌ల విధానం, టోఫెల్ శిక్షణ, ట్యాబ్‌ల పంపిణీ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు ఇలా ప్రతి దాన్నీ పనికట్టుకుని నాశనం చేయడంలో నారా లోకేష్ ముందంజలో ఉన్నాడు. సీఎంగా వైయస్ జగన్ గారు చదువులు ప్రోత్సహించడానికి అమలు చేసిన అమ్మ ఒడి పథకంను కూడా నీరుగారుస్తున్న ఘనుడు నారా లోకేష్. గత ఐదేళ్ల జగన్ విద్యావ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకొస్తే వాటిని నామరూపాలు లేకుండా చేస్తున్న ఘనత ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్‌దే. అప్పడాల మీద కూడా చంద్రబాబు ఫొటోలే చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా, తన పాలనలో ఏనాడూ విద్యావ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఏనాడూ ఒక జత యూనిఫాం, బూట్లు కూడా పిల్లలకు ఉచితంగా ఇచ్చింది లేదు. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివానని గొప్పలు చెప్పుకోవడం మినహా పేద విద్యార్థుల చదువుల కోసం రెండోసారి మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ ఏనాడూ ఆలోచించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏనాడూ తన ఫొటోలు ప్రచారం కోసం వేసుకోనట్టు, వైయస్ జగన్ మాత్రమే అలా చేశారంటూ లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రన్న కానుకల పేరుతో పేదలకు ఇచ్చిన నాసిరకం బెల్లం, పురుగులు పట్టిన గోధుమ పిండి ప్యాకెట్ల మీద, మహిళలకు పంపిణీ చేసిన కుట్టు మిషన్లు, విద్యార్ధులకు పంపిణీ చేసిన సైకిళ్లకు, ఆఖరుకి అప్పడాల మీద కూడా ఫొటోలు వేసుకున్న చరిత్ర చంద్రబాబుది. ఇదికాకుండా బెంచీలు, వాటర్ ట్యాంకులు, ఆఖరుకి శ్మశానాలను కూడా వదలకుండా పసుపు రంగులేసుకున్న చరిత్రను లోకేష్ మరిచిపోవడం విడ్డూరం. విద్యావ్యవస్థను నాశనం చేసిందే కాకుండా, సంస్కరణలు తీసుకొచ్చిన వైయస్ జగన్ ని నెల తక్కువ బాలుడు అంటూ లోకేష్ పక్కనే కూర్చుని రన్నింగ్ కామెంట్రీ చేసిన అచ్చెన్నాయుడు ఏమైనా నెల ఎక్కువతో పుట్టాడా? బెదిరించి వీసీలతో రాజీనామాలు పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యను కూడా నారా లోకేష్ వదిలిపెట్టలేదు. విశ్వవిద్యాలయాలను కుల రాజకీయాలతో భ్రష్టుపట్టించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వీసీలను లోకేష్ ఆఫీసు నుంచి ఫోన్లు చేసి బెదిరించారు. అధికారంలోకి రాగానే 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. 9 నెలలు ఇన్‌చార్జిలతో యూనివర్సిటీలను నడిపారు. తీరా వాటిని తమకు అనుకూలమైన వారితో భర్తీ చేశారు. యూనివర్సిటీల్లో చంద్రబాబు, లోకేష్ ల పుట్టినరోజులతోపాటు అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు, ఎర్రన్నాయుడు వర్థంతి ఇలా పార్టీ నేతల వ్యక్తిగత ఉత్సవాలను కూడా నిర్వహించిన చరిత్ర మరిచిపోయారా? క్లాస్ రూముల్లో టీఎన్ఎస్ఎఫ్ సభ్యత్వాలు బలవంతంగా అంటగట్టి, విశ్వవిద్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చే ప్రయత్నం చేయలేదా? చంద్రబాబు కారణంగానే యూనివర్సిటీలు స్కెలిటన్లుగా మారిపోయాయి. తన పదిహేనేళ్ల పాలనలో యూనివర్సిటీల్లో ఒక్క నియామకం కూడా చేపట్టిన పాపాన పోలేదు. చంద్రబాబు హయాంలో రీసెర్చ్ స్కాలర్స్ 75 కేసులు వేశారు. వైయస్ జగన్ పాలనలో యూనివర్సిటీలకు మంచిరోజులు వైయస్ జగన్ పాలనలో హయ్యర్ ఎడ్యుకేషన్‌ను ప్రణాళికబద్ధంగా నడిపారు. ప్రతి యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. వైయస్ జగన్ హయాంలోనే యూనివర్సిటీలకు నాక్ ఏ ప్లస్ ప్లస్ సర్టిఫికేషన్ వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా ఈ ఏ ప్లస్ ప్లస్ హోదా లేదు. 2019లో ఏ ప్లస్ హోదా నాలుగు వర్సిటీలకు ఉండగా 2024లో ఆ సంఖ్య 13కి చేరింది. 2019లో ఏ గ్రేడ్ లో 11 ఉండగా 2024 నాటికి జగన్ పాలనలో ఆ సంఖ్య 46కి చేరుకుంది. ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 5కి పడిపోయింది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో చూస్తే 2018లో 32.4 శాతం ఉండగా, 2024లో జగన్ గారు దిగిపోయే నాటికి 36.5 శాతానికి చేరుకుంది. విద్యారంగంలో జెండర్ రేషియో చూసినా 2019లో మగ, ఆడ నిష్పత్తి 100:81 గా ఉంటే, 2024లో జగన్ దిగిపోయేనాటికి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు ఫలితంగా 100:96కి చేరింది. 2018-19 మధ్య చంద్రబాబు హయాంలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 37వేల ఉద్యోగాలొస్తే, 2023-24 జగన్ హయాంలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 1.20 లక్షల మందికి వివిధ కంపెనీలు ఉద్యోగాలిచ్చాయి. అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదు. తల్లికి వందంను కూడా గతేడాది అసలు అమలు చేయలేదు. ఈ ఏడాది అరకొర నిధులు కేటాయించి పథకం అమలుపై అనుమానాలు కలిగేలా చేస్తున్నారు. తల్లికి వందనం పథకానికి రూ. 13,313 కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ. 8,800 కోట్లే కేటాయించారు. ఇప్పటికైనా పిల్లల చదువులను నిర్లక్ష్యం చేయడం మానుకోవాలి. విద్యావ్యవస్థను గాలికి వదిలేయకుండా గతంలో వైయస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు కొనసాగించాలి. -