చంద్రబాబు, ఎల్లో మీడియా తోడుదొంగలు

టీడీపీని భుజాన మోయడం కోసమే ఈ విష పుత్రికలు పుట్టాయి

ఇవి ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్‌ మీడియా రోజులు

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు

అసెంబ్లీ: చంద్రబాబు, ఎల్లో మీడియా తోడు దొంగలు కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మీడియా వక్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. తెలుగుదేశం పార్టీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గవర్నర్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తోక పత్రికలు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయిస్తున్నారని ఫైరయ్యారు. 

అసెంబ్లీలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు పుట్టిన విషపుత్రికలు అని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఎల్లోమీడియా వ్యవహరిస్తోందన్నారు. ఈ విషపుత్రికలు తెలుగుదేశం పార్టీని భుజాన మోయడం కోసం పుట్టాయని, వారు నంది అంటే నంది.. పంది అంటే పంది అని చెప్పినట్టుగా నమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గన్నవరంలో టీడీపీ నేత పట్టాభి దుర్మార్గంగా వ్యవహరించాడని, అయితే పట్టాభిని పోలీసులు కొట్టినట్టు ఈనాడు పాత ఫొటోలు ప్రచురించి ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నించిందన్నారు. సోషల్‌ మీడియా దెబ్బకు సవరణ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా అబద్ధాలను వండివార్చుతోందన్నారు. 

చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను తక్కువచేసి చూపిస్తే నమ్మే రోజులు ఇవి కాదన్నారు. ఇవి ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్‌ మీడియా రోజులు అని ఉద్ఘాటించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి ఎన్ని అబద్ధాలు చెప్పినా సోషల్‌ మీడియా పాత క్లిప్పింగ్స్‌తో సహా ప్రత్యక్షమయ్యే రోజులివి అని అన్నారు. మీడియా వక్రీకరణపై సభలో చర్చ జరగాలని స్పీకర్‌ను కోరారు.  
 

Back to Top