పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు సరికాదు

ఇలాంటి సంస్కృతి నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు

అవకతవకలు జరిగితే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు

దౌర్జన్యాలకు దిగే సంప్రదాయం కొనసాగకూడదు

చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే మా పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపు

వందల మందిని తీసుకుని వర్సిటీలకు వెళ్లి వీసీలను బెదిరించడం తప్పు

ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడ‌దు

వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వ‌జం

విజయనగరం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు, యూనివర్సిటీల్లో వీసీలను బెదిరింపులకు పాల్పడే విష సంస్కృతి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దౌర్జన్యాలు, కిరాతక చర్యలకు ప్రజాస్వామ్యంలో తావు లేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి దుశ్చర్యలు కొనసాగకూడదన్నారు. అధికారంలో ఉన్న వారు సంయమనం పాటించాలని సూచించారు. విజయనగరంలో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

ప్రయివేటు ఆస్తులపై దాడులా? 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని బొత్స అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలోనే విజయనగరం పార్టీ ఆఫీసుకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని, విజయనగరంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఆఫీసుల మీద కక్ష గట్టడం సరికాదని, చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే నడుచుకున్నామన్నారు. ఆ జీవోల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకీ, అలాగే వైయస్ఆర్ సీపీకి కూడా జరిగిందన్నారు. మిగతా పార్టీలకూ అలాగే కేటాయింపులు జరిగాయన్నారు. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. పార్టీ ఆఫీసుల లోపలికి వెళ్లి బెదిరించడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుశ్చ‌ర్య‌లు ఎప్పుడూ జరగలేదన్నారు. ఏ పార్టీ ఆఫీసు మీదకూ, రాజకీయ నాయకుల ప్రాపర్టీల జోలికి ఎవరూ పోకూడదని, చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇలాగే వెళ్తే సివిల్‌ వార్‌ గా మారే ప్రమాదం ఉందన్నారు. 

రాబోయే తరాలకు మంచిది కాదు
రాజ్యాంగబద్దంగా జరిగిన నియామకాల్లో  ఏవైనా అవకతవకలు జరిగితే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఎన్నికైన నాయకులే దౌర్జన్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఈ సంస్కృతి రాబోయే తరాలకు మంచి సంప్రదాయం కాదన్నారు. అధికారంలో ఉన్న పెద్దలు దయచేసి సంయమనం పాటించాలని సూచించారు. నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీలు బాధ్యతగా మెలగాలని, ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎప్పుడూ ఇలాంటి ఘటనలను సమర్థించబోమన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

వందల మందితో వెళ్లి వీసీలను బెదిరిస్తారా?
యూనివర్సిటీల వీసీలను రాజీనామాలు చేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు. వీసీలను నామినేట్‌ చేయడానికి ఒక ప్రక్రియ ఉంటుందన్నారు. సెర్చ్‌ కమిటీ, ఆ కమిటీలో మూడు పేర్లు ప్రతిపాదించడం, అందులో ఒక పేరును ప్రభుత్వం నామినేట్‌ చేయడం, గవర్నర్‌ కు పంపించడం, గవర్నర్‌ వారిని నామినేట్‌ చేయడం అనేది ప్రక్రియ అన్నారు. సెర్చ్‌ కమిటీలో యూజీసీ సభ్యులు, ఉన్నత విద్య అధికారులు ఉంటారన్నారు. ఇది గతంలోనూ ఉందన్నారు. నామినేట్‌ అయిన వ్యక్తి పనితీరు బాగోలేదనిపిస్తే విచారణ చేసుకోవాలన్నారు. ద్రవిడ యూనివర్సిటీలో వీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలని తానే గవర్నర్‌ కు లేఖ రాశానని గుర్తు చేశారు. ఎన్నికైన నాయకులు 200–300 మందిని తీసుకుని ఆఫీసులకు వెళ్లి బెదిరింపులకు పాల్పడటం తప్పు అని చెప్పారు. 

25 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తారని భావించాం
తమ ప్రభుత్వంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. టెట్‌ కూడా నిర్వహించామన్నారు. ఆ సమయంలో 50 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని వారే చెప్పారని, మెగా డీఎస్సీ అని 25 వేల పోస్టులైనా ఇస్తారనుకున్నామన్నారు. కానీ 16 వేల పోస్టులకే ఎందుకు పరిమితమయ్యారో తెలియడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఉద్యోగం కూడా ఇవ్వలేదనడం తప్పని, 15 వేల పోస్టుల వరకు ఇచ్చామన్నారు. 

రుషికొండలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఎలా ఉపయోగించుకుంటారో ప్రభుత్వంలో ఉన్న వారి ఇష్టమన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ విడిది కోసం వాడుకోవచ్చన్నారు. అవి పూర్తిగా ప్రభుత్వ భవనాలేనన్నారు. ఇంతకు ముందు ఉన్న భవనాల స్థానంలోనే అత్యాధునికంగా నిర్మించామన్నారు. 

Back to Top