నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, పార్టీలో ఉన్నవారంతా పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ సైనికులేనని స్పష్టం చేశారు. గ్రూపులు కట్టాల్సిన అవసరం తమకు లేదని, అదంతా ఎల్లోమీడియా దుష్ప్రచారమని దుయ్యబట్టారు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. గడపగడపకూ కార్యక్రమంలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపానన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితో భేటీ కూడా అలాంటిదేనని చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో సహకరించిన ఎమ్మెల్యేలను కలిస్తే తప్పా? వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత తనది కాదా? తన పార్టీ ఎమ్మెల్యేలను కలవడం కూడా తప్పేనా అని నిలదీశారు.
నెల్లూరు కార్పొరేషన్ సిబ్బంది ఫ్లెక్సీలు తీసేసినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్‌కుమార్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో వైయస్ఆర్ సీపీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మంత్రి కాకాణి నెల్లూరు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు కాలేదన్నారు. ఈనెల 17న గాంధీ బొమ్మ సెంటర్లో నెల్లూరు సిటీ వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులతో సభ పెట్టుకోవాలని నిర్ణయించామని, దానిని కూడా ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. గడపగడపకూ కార్యక్రమం చేపట్టే సందర్భంగా సభ పెట్టుకుంటున్నామని చెప్పారు. మంత్రి కాకాణి స్వాగత ర్యాలీని అడ్డుకునేందుకే తన సభ అని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.