గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. చలో మామిళ్ళపల్లి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు నగర ఇన్‌చార్జ్ షేక్ నూరిఫాతిమా, అన్నాబత్తుని శివకుమార్ , డైమాండ్ బాబు, అశోక్‌బాబు, శ్యామల, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.