గుంటూరు: తిరుమల శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు ప్రచారానికి పాల్పడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరులోని చిల్లి సెంటర్ వద్ద “ఇది నెయ్యే కాదు” అంటూ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ, ఆ ఫ్లెక్సీ ముందు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబటి రాంబాబు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు సహా ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్మార్గపు ప్రచారానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఫ్లెక్సీలపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చిత్రాలను పెట్టి కావాలనే అపనిందలు మోపుతూ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన ఫ్లెక్సీలను 24 గంటల్లో తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆ ఫ్లెక్సీలను చింపేస్తారని హెచ్చరించారు. తిరుమల లడ్డూ వంటి పవిత్రమైన ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన ఈ అపచారాన్ని ఆ దేవుడు కూడా క్షమించడని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.