క్రెడిట్ చోరీ, స్కాంలు, అక్రమాలకు కేరాఫ్ టీడీపీ 

మాజీ డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు  ఎస్.బి. అంజద్ బాష ఫైర్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీ, స్కాంలు, అక్రమాలతోనే నిండిపోయిందని, అందుకే టీడీపీ అంటేనే ప్రజలకు అవినీతి గుర్తుకు వస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు  ఎస్.బి. అంజద్ బాష మండిపడ్డారు. ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. మంగ‌ళ‌వారం క‌డ‌ప న‌గ‌రంలోని క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో జరిగిన రూ.360 కోట్ల స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని, ఆ కేసులో అరెస్టు అయ్యి కూడా “స్కాం జరగలేదని” ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రజాసేవకులుగా కాకుండా కోడి పందేల రాయుళ్లుగా మారిపోయారని ఆరోపించారు. కోడి పందాలు జరిగే ప్రాంతాల్లోనే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం అమ్మకాలు జరిపారని, దీనివల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.

రాష్ట్రంలో నకిలీ మద్యం ఒక కుటీర పరిశ్రమగా తయారైందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ మద్యం, అక్రమ వ్యాపారాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా ఒక డ్రగ్స్, గంజాయి కారిడార్‌గా మార్చేశారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టం చేశారు. ప్రజలంతా అన్నింటినీ గమనిస్తున్నారని, అబద్ధాలు–అక్రమాలపై తగిన సమయంలో ప్రజా తీర్పు తప్పదని  ఎస్.బి. అంజద్ బాష  హెచ్చరించారు. 

Back to Top