నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇస్తారనుకుంటే.. అవేమీ లేకుండానే పరిపాలనలో తన వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది తేటతెల్లం చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయబోవడం లేదని, ఈ సదస్సులో సీఎం పరోక్షంగా తేల్చి చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఆదాయం పెంచి, హామీలు నెరవేరుస్తానని ఎన్నికల మందు గొప్పగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు, ఆ దిశలో తానేం చేయబోతున్నాడనేది కలెక్టర్ల సదస్సులో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆక్షేపించారు. కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని, సంపద సృష్టిపై వారు దృష్టి పెట్టాలని సీఎం కోరడం ఎంత వరకు సబబు? అన్న కాకాణి, అదెలా సాధ్యమని అన్నారు. వచ్చే సెప్టెంబరు 20 నాటికి, తమ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో, తన మార్క్ పాలన కనిపించాలని చంద్రబాబు కోరారని.. నిజానికి ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు పాలన మార్క్ కనిపిస్తోందని మాజీ మంత్రి చెప్పారు. నారా లోకేష్ రూపొందించిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ.. హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నారని ప్రస్తావించారు. పేరుకే ఉచిత ఇసుక అని, కానీ అందులో యథేచ్ఛగా దోచుకుంటున్నారని చెప్పారు. పదే పదే ఖజానా ఖాళీ అన్న మాట మాట్లాడుతూ, దాని వల్లే ఏమీ చేయలేకపోతున్నామంటూ.. గత తమ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. అప్పుడు రాష్ట్ర అప్పులపైనా తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారన్న ఆయన, వాస్తవానికి మించి చాలా ఎక్కువ లెక్కలు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇక రాజకీయ పాలన కొనసాగుతుందని, ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యేలు) చెప్పినట్లు కలెక్టర్లు వినాలని చెప్పడం చంద్రబాబు వైఖరిని చూపుతోందని కాకాణి వెల్లడించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ తగ్గించాలని చెబుతూ.. మరోవైపు బడి మానేసిన పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించాలని చెప్పడం సిగ్గుచేటు అని అభివర్ణించారు. గతంలో తాము సిద్ధం చేసిన బడి పిల్లల కిట్లు చాలా చోట్ల ఇవ్వకుండా నిలిపేశారని, మరోవైపు స్కూళ్లు తెరిచి నెలలు గడుస్తున్నా పిల్లలకు కిట్లు ఇవ్వలేకపోతున్నట్లు చెబుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. సంపద సృష్టిస్తానని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లన్నీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మంచి, ఆ తర్వాత టోల్‌గేట్లు పెట్టి, ఆదాయం పొందాలని చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలపై ఆ భారం వేయాలన్న ఆలోచన ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. ఒక్కో రంగాన్ని ప్రైవేటీకరించే దిశలో పని చేస్తున్నారన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఇప్పటికే విద్య, వైద్య రంగాల్లో ఆ ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పారు. ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలపై కలెక్టర్ల సదస్సులో స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేశారు. అదే గత ప్రభుత్వ హయాంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరవాత కలెక్టర్ల సదస్సు నిర్వహించిన శ్రీ వైయస్ జగన్, ఆనాడు ఏం మాట్లాడారన్నది కాకాణి ప్రస్తావించారు. ‘నవరత్నాల హామీల అమలుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి. అందుకు మీ ఆలోచనలు చెప్పండి. ప్రతి మంత్రి, ప్రతి కలెక్టర్ మ్యానిఫెస్టో దగ్గర ఉంచుకుని, వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్ధ ఎలా ఉండాలి?. వలంటీర్ వ్యవస్ధ ఏ విధంగా ఉండాలి?. ఏ విధంగా ఉంటే అత్యుత్తమంగా సేవలందించగలం?. మీరూ ఆలోచించండి. ప్రభుత్వ సేవలు ఇంటి గడప వద్దే అందాలి. రాజకీయాలు లేకుండా పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేయాలి. పూర్తి సంతృప్తస్థాయిలో ప్రతి పథకం అమలు కావాలి. ఇళ్ళ స్ధలాల పంపిణీ కోసం భూములు గుర్తించాలి’.. ఇలా ప్రతి విషయంలో ప్రజలకు మేలు చేసేలా.. ఆ కలెక్టర్ల సదస్సులో జగన్‌గారు దిశానిర్దేశం చేశారని కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. అదే ఇప్పుడు సీఎం చంద్రబాబు నిన్న (సోమవారం)టి కలెక్టర్ల సదస్సులో ఏం మాట్లాడారన్నది ప్రజలు గుర్తించాలని మాజీ మంత్రి కోరారు. నేరుగా ఎమ్మెల్యేలు శిలాఫలకాలు పగలగొడుతున్నారన్న ఆయన, ఇదేనా ప్రభుత్వ సందేశం? అని ప్రశ్నించారు. ఏదేమైనా ప్రజల కోసం గట్టిగా నిలబడతామని, ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాకాణి గోవర్థన్‌రెడ్డి వివరించారు.