పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే శనిగ్రహం

వైయ‌స్ జగన్ కృషి వల్లనే పోలవరానికి కేంద్రం నిధులు
 
మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ 

వైయ‌స్ జగన్ హయాంలోనే నిధులకు కేంద్రం సంసిద్ధత

కానీ నాడు విడుదల కానివ్వకుండా చంద్రబాబు కుట్ర

అవే నిధులను ఇప్పుడు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది

పోలవరంపై చంద్రబాబువన్నీ అసత్యాలు. అభూత కల్పనలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

రివర్స్‌ టెండరింగ్‌ రద్దు నిర్ణయం అసంబద్ధం

దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో గండం

గతంలో మాదిరిగా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

గుంటూరు: పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే శనిగ్రహం అని, ఆయన వల్లనే ప్రాజెక్టుకు ఈరోజు ఆ దుస్థితి నెలకొందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు సీఎంగా వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తోందన్న ఆయన, నిజానికి నాడు ఎన్నికల ముందు, ఆ నిధులు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారని వెల్లడించారు. పోలవరంకు కేంద్రం నిధులపై వైయ‌స్ జగన్‌గారికి క్రెడిట్‌ రాకూడదన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఆ పని చేశారని, ఇప్పుడు అవే నిధులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలనీ, అభూత కల్పనలని అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

విడ్డూరంగా విమర్శలు:
    పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదించడంపై సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి అవాస్తవాలు చెబుతూ.. జగన్‌గారిని, దివంగత రాజశేఖర్‌రెడ్డిగారిని దూషించారని మాజీ మంత్రి మండి పడ్డారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి జగన్‌ గారే కారణమని, మాది దుష్ట ప్రభుత్వం అని.. రకరకాల ఆరోపణలు, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

అదంతా వైయ‌స్ జగన్  కృషి:
    పోలవరం మొదటి దశ అంటే 41.15 మీటర్ల నీటి నిల్వకు సంబందించిన దశ కాగా, అది పూరై్తన తర్వాత రెండో దశకు వెళ్తారని గుర్తు చేసిన అంబటి రాంబాబు, అప్పుడు 45.72 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేయొచ్చని తెలిపారు. ఆ మొదటిదశ పనుల పూర్తికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.12,157 కోట్ల నిధుల కోసం నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్, అనేక సార్లు ప్రధానితో, అప్పటి జలశక్తి మంత్రితో చర్చించి, వారిని ఒప్పించి విడుదలకు అంగీకరింపచేశారని వెల్లడించారు. అంతేతప్ప, ఆ నిధుల విషయంలో చంద్రబాబు చేసిన కృషి ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు.
    పోలవరం పనులను మొదలు పెట్టిన వైయస్సార్‌గారు కాలువల పనులను వేగం చేసి, కుడి కాలువలో 90 శాతం పూర్తి చేశారని చెప్పారు. దాన్నే పట్టిసీమ పేరుతో మనం ఉపయోగించుకుంటున్నామని గుర్తు చేశారు.

కమీషన్ల కోసం బాబు కక్కుర్తి:
    నిజానికి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం, ఆ పనులు చేయాల్సి ఉన్నా.. కమిషన్ల కోసమే నాడు చంద్రబాబు ఆ పనులు తామే చేస్తామని తీసుకున్నారని మాజీ మంత్రి తెలిపారు. అంతే కాకుండా, 2013–14 రేట్ల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2016లో చెప్పడం దారుణమని అన్నారు. 
    2013–14 స్టాండర్ట్‌ రేట్ల ప్రకారం నాడు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398 కోట్లు కాగా, అందులో రూ.4,730.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని.. దాంతో మిగిలిన రూ.15,668 కోట్లు ఇస్తామన్నా, అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారన్న అంబటి.. అది ఎవరి కోసం చేశారని నిలదీశారు.

ఆత్మస్తుతి–పరనింద:
    పోలవరం పనులు గురించి మాట్లాడిన చంద్రబాబు నటన మహా అద్భుతంగా ఉందని ఎద్దేవా చేసిన అంబటి.. జగన్‌గారు సీఎం అయ్యాకే, ప్రాజెక్టు పనులు ప్రొటోకాల్‌ ప్రకారం జరిగాయని, వేగంగా కొనసాగాయని స్పష్టం చేశారు. అదే విషయాన్ని నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పిందన్న ఆయన, ఆ మేరకు నివేదిక కూడా సమర్పించారని గుర్తు చేశారు.
    ప్రాజెక్ట్‌ పనులన్నీ ఒకేసారి ప్రారంభించి, కొంప ముంచారని ఇప్పటి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావించిన అంబటి రాంబాబు.. అయినా చంద్రబాబు తాను చేసిన తప్పులన్నింటినీ జగన్‌గారిపై వేసే ప్రయత్నం చేస్తూ.. ఆత్మస్తుతి–పరనింద అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.

పోలవరం–అంచనాలు:
    పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలన్నింటినీ సవరిస్తూ.. పెరిగిన రేట్ల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని నాడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కేంద్రానికి నివేదించారని అంబటి రాంబాబు తెలిపారు. ప్రాజెక్టును మొత్తం పూర్తి చేయడానికి రివైజ్డ్‌ రేట్ల ప్రకారం రూ.55,656 కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి మేం పంపితే.. అక్కడ టెక్నికల్‌ ఎస్టిమేషన్‌ కమిటీ చర్చించి రూ.47,725 కోట్లకు అనుమతి ఇచ్చారని చెప్పారు.
    అలాగే ప్రాజెక్టు ఫస్ట్‌ స్టేజ్‌ పూర్తి చేయడానికి రూ.31,625 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రానికి పంపితే, వాటిని సవరించిన కేంద్రం (కేంద్ర జలసంఘం) రూ.30,436 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. ఇదంతా ఎన్నికల ముందే జరిగిందన్న ఆయన, ఆనాడు దాన్ని క్యాబినెట్‌ ముందు పెట్టకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. ఆ నిధులనే ఇప్పుడు కేంద్రం ఆమోదిస్తే.. అదంతా తన ఘనత అన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు ఆక్షేపించారు.

ఆ నిర్ణయం అసంబద్ధం:
    రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడడమే కాకుండా, గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్ట్‌ పనుల్లో అవినీతికి తావు లేకుండా దేశంలో ఎక్కడా లేని వి«ధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు.
    పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల ఇదంతా జరిగిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పు బట్టిన మాజీ మంత్రి, గతంలో నవయుగ కంటే ముందు స్టాల్‌స్టాయ్‌ ఉంటే దాన్ని ఎటువంటి టెండర్లు లేకుండా నామినేషన్‌ విధానంలో మార్చి నవయుగకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అది రామోజీ బంధువుల కంపెనీ అని అందరికీ తెలుసని చెప్పారు.

రివర్స్‌ టెండరింగ్‌–ఆదా:
    తమ ప్రభుత్వం వచ్చాక, పోలవరం పనులకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల రూ.850 కోట్లు ఆదా అయ్యాయన్న ఆయన.. అదే ప్రాజెక్టు జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంలోనూ రూ.782 కోట్లు, లెఫ్ట్‌ కనెక్టివిటీ 65 ప్యాకేజీ పనుల్లో రూ.58.53 కోట్లు, సోమశిల కెనాల్‌ రెండోదశ పనుల్లో రూ.67.09 కోట్లు, వెలిగొండ రెండో టన్నెల్‌ పనుల్లో  రూ.61.76 కోట్లు.. ఇలా ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లోనే రూ.2400 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
    పేదల ఇళ్ల నిర్మాణంలో 12 రకాల సామాగ్రి సేకరణలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల రూ.5120 కోట్లు ఆదా కాగా, విద్యుత్‌ రంగానికి సంబంధించి 2021–22లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం ద్వారా రూ.4925 కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు కాలువ విస్తరణ పనుల్లో రూ.44.15 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.

చంద్రబాబుది ఫిరాయింపుల రాజకీయం: అంబటి రాంబాబు  
చంద్రబాబునాయుడుగారిది ఎప్పుడైనా ఫిరాయింపుల రాజకీయం అని, ఆయనకు ఎమ్మెల్యేలు, ఎంపీల అమ్మకం, కొనుగోలు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల అవినీతికి మార్గం చూపించిందే చంద్రబాబు అని స్పష్టం చేసిన ఆయన, కేవలం 100 రోజుల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ గ్రాఫ్‌ పడిపోయిందని తేల్చి చెప్పారు. గుంటూరులోని తన నివాసంలో మీడియా ప్రశ్నలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు జవాబు ఇచ్చారు. 
    గతంలో 23 మంది వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకోగా.. వారిలో ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారెవ్వరూ ప్రజలకు గుర్తు లేరని, అందరూ కాలగర్భంలో కలిసిపోయారని అంబటి చెప్పారు. కాగా, ఇప్పుడు ఎంపీ మోపిదేవి వెంటకరమణ తమ పార్టీ వీడుతారని భావించడం లేదన్న ఆయన, మోపిదేవి అత్యంత విధేయం ఉన్న వ్యక్తి అని.. ఒకవేళ పార్టీ మారాలన్న ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవాలని సూచించారు. 2019లో ఎమ్మెల్యేగా గెలవకపోయినా మోపిదేవి వెంకటరమణకు ప్రాధాన్యతనిచ్చిన వైయ‌స్ జగన్‌గారు, ఆయనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
    వైయ‌స్ జగన్‌గారు, ఎవరినీ వదులుకునే వ్యక్తి కాదని.. అధికారం శాశ్వతం కాదని.. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం ఖాయమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారరన్న ఆయన, ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

    కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలతో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందన్న మాజీ మంత్రి, సాక్షాత్తూ ముఖ్యమంత్రే కేబినెట్‌ సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పే స్ధాయికి అధికార పార్టీ మీటర్‌ పడిపోయిందని ప్రస్తావించారు.

Back to Top