తాడేపల్లి: రాష్ట్రంలో రైతులకు సకాలంలో యూరియా అందకపోవడం పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతకు అండగా నిలిచి రోడ్డెక్కారు. యూరియా కోసం రైతులు రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్దకు వెళ్తే స్టాక్ రాలేదని చెప్పడంతో ఆందోళనకు దిగారు. యూరియా కొరతపై సోమవారం రైతులు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతులకు మద్దతుగా కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీ కి బయలుదేరిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా బయలుదేరిన ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు గొర్లె కిరణ్ కుమార్‌ను రణస్థలం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారి పై కిరణ్‌కుమార్, పార్టీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే యూరియా కొరతపై జిల్లా కేంద్రంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఆముదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవి కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కారును ముందుకు కదలకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరును ధర్మాన తీవ్రంగా ఖండించారు. రైతులకు సకాలంలో యూరియా అందించలేని కూటమి సర్కార్..ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.