గుళ్లు కూల్చే దుర్మార్గులకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు

వినాయక మండపాలకు ఎలాంటి కొత్త ఆంక్షలు లేవు

గత ప్రభుత్వంలో ఉన్న నిబంధనలనే.. ఇప్పుడూ కొనసాగిస్తున్నాం

సింగిల్‌ విండో విధానంతో పర్మిషన్లను సులభతరం చేశాం

చవితి ఉత్సవాలపై సోము వీర్రాజు, చంద్రబాబు దుష్ప్రచారం

వినాయక ఉత్సవాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఆ దేవుడే శిక్షిస్తాడు

చంద్రబాబు 40 గుళ్లు కూల్చినప్పుడు సోము వీర్రాజు ఎక్కడున్నాడు..?

మీరు కూల్చిన గుళ్లు, తగులబెట్టిన  రథాలు, ధ్వంసం చేసిన విగ్రహాలను సీఎం వైయస్‌ జగన్‌ అద్భుతంగా నిర్మించారు

ఇంకోసారి వినాయక మండపాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు

సోము వీర్రాజు, బీజేపీ నేతలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరిక

తాడేపల్లి: దేవాలయాలు, దేవుడు గురించి మాట్లాడే నైతిక హక్కు సోము వీర్రాజు, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌కు లేదని, చీకట్లో ఆలయాలను ధ్వంసం చేసి నీచ చరిత్ర ఆనాటి టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షానిదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వినాయక చవితి మండపాల పర్మిషన్ల గురించి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో తయారు చేసిన స్క్రిప్టును పట్టుకొని సోము వీర్రాజు, బీజేపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. వినాయక ఉత్సవాలకు ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని, గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలకే కొనసాగిస్తున్నామని చెప్పారు. లేనిపోని దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వంపై నిందలు వేయాలని టీడీపీ, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. చీకట్లో ఆలయాలు కూల్చి, విగ్రహాలను ధ్వంసం చేసి, రథాలు తగులబెట్టే వారికి దేవాలయాలు, దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
‘వినాయక మండపాలపై సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాన్ని తిప్పుతున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో తయారవ్వడం, దాన్ని బీజేపీ నేతలు మాట్లాడటం. మండపాలకు ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని రాష్ట్ర డీజీపీ, దేవాదాయ శాఖ కమిషన్‌ చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా చెప్పారు. అయినా కూడా సోము వీర్రాజు, టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో ఏర్పడిన ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు తప్ప.. ఎక్కడైనా ఒక్క ఆంక్ష వినాయక మండపాలపై పెంచినట్టుగా ప్రూవ్‌ చేయగలుగుతారా..? 

గతంలో ఫైర్, మున్సిపల్‌ కార్పొరేషన్, పోలీస్, ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంట్‌ పర్మిషన్‌ విడివిడిగా అప్లయ్‌ చేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగిల్‌ విండో సిస్టమ్‌తో అన్ని డిపార్టుమెంట్ల సమన్వయంతో పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేస్తున్నాం. పవర్‌ చార్జీస్‌ 2017లో టారీఫ్, 2022లో ఇచ్చిన పవర్‌ టారీఫ్‌లు పోల్చి చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ప్రతీ ఒక్కరూ మండపాలు ఏర్పాటు చేసుకొని దేవుడిని పూజించాలనే ఆలోచనతో తక్కువ పవర్‌ చార్జీలకు అవకాశం కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌ను, ఈ ప్రభుత్వాన్ని తూలనాడుతారా..? వినాయక చవితి గురించి మాట్లాడే అర్హత సోము వీర్రాజుకు, చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు దేవాలయాలు, దేవుడి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 

పుష్కరాల పేరుతో దుర్మార్గంగా వినాయక స్వామి, ఆంజనేయస్వామి, రాహుకేతవులు, అమ్మవారి గుళ్లు కూల్చేసిన దుర్మార్గులు.. మా ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేవాలయాల కూల్చివేతపై సోము వీర్రాజు పోరాటం చేశామని మాట్లాడటం హాస్యాస్పదం. దేవాదాయ శాఖ మంత్రిగా మణిక్యాలరావు ఉన్నారు కదా.. ఏం సాధించారు. 2014లో బీజేపీ తరఫున పోటీ చేశా.. నా నియోజకవర్గంలోనే 40 గుళ్లు కూల్చేశారు. నేను అడ్డుపడి బంద్‌కు పిలుపునిస్తే.. నా బంద్‌కు సంబంధం లేదని బీజేపీ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మాట వాస్తవమా.. కాదా.. అనేది సమాధానం చెప్పాలి. ప్రజా ఆగ్రహం చూసి.. బంద్‌ సక్సెస్‌ అయ్యి.. ఆ తరువాత లైన్‌లోకి వచ్చారు తప్ప ఆనాడు బీజేపీ నేతలంతా టీడీపీ తాబేదారులుగానే పనిచేశారు. 

సోము వీర్రాజును గోశాల వద్దకు నేను తీసుకెళ్లాను. ఆ రోజున బుద్ధా వెంకన్న ఎదురుపడితే మీరేమైనా చెయ్యగలిగారా..? మిత్రపక్షం నుంచి బయటకు వచ్చారా..? వారితో అంటకాగలేదా..? కృష్ణా పుష్కరాల అనంతరం ఎందుకు గుళ్లు నిర్మించలేకపోయారు. దేవాలయాలను కూల్చిన ద్రోహులు బీజేపీ సోము వీర్రాజు,  టీడీపీ నారా చంద్రబాబు నాయుడు, జనసేన దత్తపుత్రుడు ఈ ముగ్గురూ బాధ్యులే.. అందుకే దేవుడు వారిని క్షమించలేదు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సున్నా, చంద్రబాబును 23, పవన్‌ కల్యాణ్‌ను రెండు చోట్ల ఓడించాడు. 

ఇకనైనా ఈ ముగ్గురూ బుద్ధి తెచ్చుకోండి.. ఆలయాల మీద రాజకీయాలు చేయడం, మతాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సాధిద్దామని భ్రమపడకండి. చీకట్లో గుళ్లు కూల్చేసిన దుర్మార్గులు, రథాలను కాల్చడం, విగ్రహాలను ధ్వంసం చేసింది మీరు కాదా..? వాటిని అద్భుతంగా రూపొందించిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. అంతర్వేది రథం మూడు నెలల్లో నిర్మించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. రామతీర్థంలో ఘటన తక్షణమే స్పందించి శ్రీరామ నవమికి దేవాలయాలన్ని రాతి నిర్మాణం చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత సోము వీర్రాజు, బీజేపీ నేతలు, చంద్రబాబు, టీడీపీ నాయకులు, పవన్‌ కల్యాణ్‌కు లేదు. 

ఇంకోసారి వినాయక చవితి మండపాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే హక్కు, అధికారం అందరికీ ఉంది. వారందరికీ ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి, ప్రచారం చేస్తే దేవుడు క్షమించడు’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top