కాకినాడ: ఈ ఏడాది ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సంతోషాలను దూరం చేసిందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు... మరోవైపు ప్రభుత్వ పథకాల అమలుకు మంగళం... దీనితో గ్రామాల్లో ప్రజలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పండుగకు గతంలో చంద్రబాబు బ్రాండ్ అంటూ గొప్పగా చెప్పుకునే సంక్రాంతి కానుక అయినా అందిస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తే, వారికి మొండిచేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సరిగ్గా ఇదే సంక్రాంతి పండుగ సమయానికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన డబ్బును అర్హులైన పేదల ఖాతాలకు జమ చేసిందని, సంతోషంతో పల్లెల్లో పండుగను ఆ కుటుంబాలు జరుపుకున్నాయని గుర్తు చేశారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రమే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఏడు నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల పేద వర్గాలు ప్రభుత్వ చేయూత, సాయం అందక తీవ్ర నిరాశలో ఉన్నాయి. అమ్మ ఒడి వంటి పథకాన్ని రద్దు చేసి, ఘనంగా ప్రకటించిన తల్లికి వందనంను ఈ ఏడాది ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకానికి బకాయిలు పెట్టి, వైద్య సేవలు నిలిచిపోయేలా చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతుభరోసాను అటకెక్కించారు. గ్రామాల్లో ప్రభుత్వపరమైన సంక్షేమంను పూర్తిగా గాలికి వదిలేశారు. చివరికి పల్లెల్లో పేదలు తమ పిల్లలకు కూడా కొత్త దుస్తులు కొనుగోలు చేసే పరిస్థితిలో లేకుండా చేశారు. నేడు మార్కెట్లు ఎక్కడ చూసినా వెలవెల పోతుండటమే దీనికి నిదర్శనం. సంక్రాంతికి సొత ఊళ్ళకు వెళ్ళడం మా కుటుంబంతోనే ప్రారంభమైందని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షలు, కార్పణ్యాలతో వారిని గ్రామాల్లోంచి తరిమేశారు. మీరు చేసిన అరాచకం వల్ల నేటికీ అనేక మంది తమ సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక శాంతియుత వాతావరణం గ్రామాల్లో కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసింది పాతబకాయిలు రూ.6700 కోట్లు చెల్లించడం అద్భుతం అంటూ ఈ రోజు ఎల్లోమీడియా కూటమి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ పెద్ద ఎత్తున ప్రచార కథనాలు ప్రచురించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం రూ.100 కోట్ల ఖజానాతో, కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించింది. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలోని బకాయిలను ఎలా చెల్లిస్తుందో చూస్తామంటూ ఆనాడు విమర్శలు చేశారు. అయినా కూడా గత ప్రభుత్వ బకాయిలను తీర్చడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ప్రతి దానికీ డైవర్షన్ పాలిటిక్స్ కింద వైయస్ జగన్ గారిపైన విమర్శలు, ఆరోపణలు చేయడంతోనే పాలన సాగిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వం హనీమూన్ పిరియడ్ అయిపోయింది. నిజమైన పాలనను చూపించాలి. తిరుపతిలో తొక్కిసలాటకు మీ వైఫల్యం, దీనికి సిగ్గుపడాలి. తిరుమల తిరుపతిలో ఇటువంటి దుర్ఘటన జరగడం మీ చేతకానితనం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి బాధితులకు డబ్బులు ఇచ్చి మాట్లాడించారని దేవాదాయశాఖ మంత్రి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను క్షమాపణ చెప్పాను, మీరు కూడా చెప్పాలని డిప్యూటీ సీఎం చెబితే టీటీడీ చైర్మన్ దానిపై అవసరం లేదంటూ మాట్లాడిన మాటలను ప్రజలంతా గమనించారు. ఈ దుర్ఘటనకు నిజంగా క్షమాపణ చెప్పాల్సింది సీఎం చంద్రబాబు. అక్కడ పనిచేస్తున్న అధికారులంతా చంద్రబాబు సొంత టీం. సమన్వయ లోపంతో ఉన్న వారిని పిలిచి మాట్లాడినా కూడా చంద్రబాబును చూసి ఏ మాత్రం వారు భయపడటం లేదు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఆనాడే చంద్రబాబు క్షమాపణలు చెప్పలేదు. ఎల్లో మీడియాగా తెలుగుదేశంకు వంతపాడే ఏబీఎన్ లోనే వేమూరి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వంకు అధికార యంత్రాంగంపై పట్టు లేదని ప్రకటించారు. చంద్రబాబు అంటే అధికారులకు భయం, భక్తీ లేవని స్పష్టంగా చెప్పారు. కూటమి పార్టీల మధ్య సమన్వయమే లేదని ఎత్తి చూపారు. ఇదీ మీ పాలన. ఆలయాలకు వెళ్ళే భక్తుల వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు? తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో తప్పుడు ప్రచారం చేశారు. వైయస్ జగన్ పై బుదరచల్లేందుకు కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారంను చూసి మొత్తం దేశం అంతా కూడా ఛీ కొట్టారు. తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేలా మీరు చేసే దుర్మార్గాల వల్ల ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయి. ఆలయాలకు వెడుతున్న భక్తుల ఫోన్ నెంబర్లను ఆలయ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెంబర్లను ఆర్టీజీఎస్ కు పంపి, వివరాలను నమోదు చేస్తున్నారు. టీటీడీ సమీక్షా సమావేశాల్లో ప్రైవేటు వ్యక్తులు కూర్చుంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను టీటీడీలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు దేశంలోనే పేరున్న ప్రముఖ ఐటీ కంపెనీలు ఉన్నాయి. శ్రీవారికి ఉచితంగా సేవలు అందించేందుకు అనేక సంస్థలు సిద్దంగా ఉన్నాయి. వాటిని ఎందుకు పిలవలేదు. గతంలో మీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్న వారిని తీసుకువచ్చి టీటీడీ సమీక్షా సమావేశాల్లో కూర్చోబెట్టారు. ఏ నోటిఫికేషన్ ద్వారా వారిని నియమించారు, ఈ సమావేశాల్లోకి ఎలా అనుమతించారో చెప్పాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడే పెద్దలు దీనిపై స్పందించాలి. వైయస్ జగన్ హయాంలో ప్రాజెక్ట్ కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు పవన్ కళ్యాణ్ కర్నూల్ జిల్లాలో గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ అద్భుతమైన ప్రాజెక్ట్ అని కితాబు ఇవ్వడం చాలా సంతోషం. ఈ ప్రాజెక్ట్ గత సీఎం వైయస్ జగన్ గారి చొరవతో వచ్చింది. దీనిని చూసిన తరువాత పవన్ కళ్యాణ్ రెన్యువబుల్ ఎనర్జీకి రోల్ మోడల్ లాంటి ఈ ప్రాజెక్ట్ ను దేశంలోనే ఆదర్శంగా నిర్మిస్తున్నారని అభినందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైయస్ జగన్ గారి చొరవతో ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఇది పూర్తయి మంచి గుర్తింపును పొందితే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కుట్రతో ఈ ప్రాజెక్ట్ పై టీటీడీ నేతలు పలు ఆరోపణలు చేశారు. అటవీశాఖ భూములను ఆక్రమించారని, నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ ప్రాజెక్ట్ పై విమర్శలు చేశారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో మీరు వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ కు ఏ పారిశ్రామికవేత్తలు వస్తారు? ఇటువంటి విధానాలను అమలు చేస్తున్న మీరు వైయస్ జగన్ పై అర్థం లేని వ్యాఖలు చేస్తున్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వైయస్ జగన్ గారు మళ్ళీ అధికారంలోకి రారు అని బాండ్ రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంను చేపడుతుందనేది ప్రజలు నిర్ణయిస్తారా? లేక ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు నిర్ణయిస్తారా? ఇలా ఎవరైనా అడుగుతారా? నిజంగా అది వాస్తవమైతే ఆ పారిశ్రామిక వేత్తల పేర్లు రాసివ్వండి. వేలకోట్లు పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలు ఈ కొంచెం లాజిక్ కూడా తెలుసుకోకుండా అమాయకంగా మాట్లాడతారా? ఒకవైపు మీ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం గ్రీన్ కో వంటి గొప్ప ప్రాజెక్ట్ లు రావడం ఏపీకి గర్వకారణమని అంటారు... మరోవైపు జగన్ గారు సీఎంగా ఉంటే పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడానికి భయపడుతున్నారని లోకేష్ అంటున్నారు. ఇందులో ఏది నిజం? జగన్ గారి హయాంలో పారిశ్రామికవేత్తలు రాకపోతే ఇన్ని పారిశ్రామిక క్లస్టర్స్ ఎలా ప్రారంభమయ్యాయి. రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం తరువాత మిగిలిన మూడేళ్ళలోనే ఈ ప్రగతి సాధ్యపడింది. విద్యావ్యవస్థలో ప్రగతిని చూడలేని దృతరాష్ట్రులు మీరు నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ గారిని కంసమామా అంటూ సంబోధించారు. వైయస్ జగన్ హయాంలో విద్యావ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చారు, నాడు-నేడు వంటి గొప్ప పథకాలను అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఎంతగా మార్చివేశారు, ఏనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని అమ్మ ఒడి వంటి పథకాలను అమలు చేశారు, ప్రతి విద్యార్థికి మేనమామలా అండగా ఎలా నిలిచారో ప్రజలకు తెలుసు. విద్యాదీవెన, వసతిదీవెన, గోరుముద్ద పేరుతో మంచి మెనూతో కూడిన మధ్యాహ్న భోజనం, నాణ్యమైన యూనిఫారం, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ ను మీ హయాంలో తీసుకురావాలన్న ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఇన్ని చేసిన వైయస్ జగన్ గారు కంసుడు అయితే, మీరు ఈ విద్యావ్యవస్థలోని ప్రగతిని చూడలేని దృతరాష్ట్రులా? ప్రజల్లోకి వెళ్ళి అడగండి.