ఈవీఎంలతో మోసం చేశారు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి

ఈవీఎంల ద్వారా దేశవ్యాప్తంగా జరిగిన మోసాలపై డెమో

ధర్మవరం: ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కుట్రలు, మోసాలతో జరిగాయని, ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడి గెలుపొందారని తాను అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ డెమో ద్వారా వివరించారు. 
నియోజకవర్గాలలో పోలైన ఓట్లు, ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలోని పలు రాష్ట్రాలలో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో మోసాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్‌ రోజు ఉదయం 10 గంటలకే కూటమి అభ్యర్థులు 120 సీట్లు గెలిచారు.. 150 సీట్లు గెలిచారంటూ టీవీలలో చూపించారన్నారు. 

ఇలా చేయడం వల్ల కౌంటింగ్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు బయటకు వెళ్లిపోతే అధికా­రులతో వన్‌సైడ్‌గా చెప్పించుకోవచ్చని పథకం పన్ని అమలు చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. తాను ఓడిపోయిన బాధలో మాట్లాడట్లేదని, తాము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 

కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారు ఏ మాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ఓడినా ప్రజల కోసం గొంతు వినిపిస్తానన్నారు. కార్యకర్తలెవ్వరూ అధైర్య పడొద్దన్నారు. రానున్న రోజులు మంచిగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

Back to Top