అమరావతి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, ఎల్లో మీడియా కలసికట్టుగా చేస్తున్న ప్రచారాన్ని సీఎం వైయస్ జగన్ మరోసారి కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2019 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 2024 ఎన్నికల నోటిఫికేషన్ కూడా మార్చిలోనే వస్తుంది. అంటే ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది’ అని మంత్రులతో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి మండలి సమావేశం అనంతరం అజెండా ముగిశాక అధికారులు నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రులతో సమకాలీన రాజకీయ పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పించేలా జీపీఎస్ విధానాన్ని తేవడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకుంటూ సుమారు పది వేల మంది రెగ్యులరైజేషన్ను తాజాగా ఆమోదించామన్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల హామీల్లో 99.5 % అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోనే మాయం చేసిన చంద్రబాబు మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ తొమ్మిది నెలలు మరింత కష్టపడాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళుతూ అదే సమయంలో విపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలతో సమన్వయంతో వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని మంత్రులకు సూచించారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. వ్యవసాయ రుణాల మాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను.. ఇలా అన్ని వర్గాలను మోసగించారు. ప్రజలెక్కడ నిలదీస్తారో అనే భయంతో టీడీపీ వెబ్‌సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోనే మాయం చేసిన చరిత్ర చంద్రబాబుది. దీన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయండి’ అని సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉందన్నారు. కలసికట్టుగా పనిచేస్తే 2024 ఎన్నికల్లోనూ విజయం మనదేనని మంత్రులతో పేర్కొన్నారు 15 నుంచి ‘సురక్షా చక్ర’! ఎలాంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తూ మేలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా మిగిలిపోతే పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ దిశగా తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. అర్హులు ఎవరూ ప్రయోజనం పొందకుండా మిగిలిపోకూడదన్న సంకల్పంతో ఈనెల 15వ తేదీ నుంచి ‘సురక్షా చక్ర’ కార్యక్రమం ద్వారా గృహ సారథులు, వలంటీర్లు నెల రోజుల పాటు ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ పరిశీలన చేపట్టనున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారిని గుర్తించి లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టనున్నారు. తమకు అన్నీ అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన వారిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరనున్నారు.