ఇంగ్లీష్‌ మీడియం అమలైతే తెలుగు భాష కాదు..టీడీపీ అంతం 

డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి
 

అసెంబ్లీ: రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియం అమలైతే తెలుగు భాష కాదు..తెలుగు దేశం పార్టీ అంతమవుతుందని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్‌ మీడియంపై ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. చదువుకు, టాలెంట్‌కు పేదరికం అడ్డుకాకూడదు. సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకువచ్చారు. ఇంగ్లీష్‌ అవసరం ఎంత. ఇంగ్లీష్‌ రాకపోతే ఎంత నష్టం అన్న విషయంలో నేనే ఒక ఉదాహరణ. నేను పదో తరగతి వరకు ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ స్కూల్‌లో చదివాను. ఇంటర్‌ సెయింట్‌ థెరిసాలో చేరాను. ఇంగ్లీష్‌ రాక మూడు నెలలు అన్ని సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయ్యాను. భయంతో అక్కడ మానేసి జంగారెడ్డిగూడెంలో తెలుగు మీడియంలో చేరాను. టెన్త్‌ వరకు ఫస్ట్‌క్లాస్‌ స్టూడెంట్‌ను..ఇంటర్‌లో చాలా వెనుకబడ్డాను. డిగ్రీలో ఇంగ్లీష్‌ మీడియంలో చేరాను. మూడేళ్లు ఇంగ్లీష్‌ చదివాను కాబట్టి అర్థం అవుతుంది కానీ, ఇంగ్లీష్‌ రాదు. ఇటీవల గురుకుల పాఠశాలలో సైన్స్‌ఫెయిర్‌కు వెళ్తే పిల్లలంతా కూడా ఇంగ్లీష్‌లో చెబుతుంటే అర్థం చేసుకున్నాను కానీ మాట్లాడలేకపోయాను. ఇంగ్లీష్‌ రాదని చెప్పడానికి సిగ్గుపడటం లేదు. చాలా మంది ఇంగ్లీష్‌ వస్తుందని చెప్పుకుంటుంటారు. మేం చదువుకునే సమయంలో వైయస్‌ జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఉండి ఉంటే మేం కూడా ఇంగ్లీష్‌ మీడియంలో చదివి బాగా మాట్లాడి పేరు తెచ్చుకునేవాళ్లం. ఈ రోజుల్లో కూలీలు, ఆటో డ్రైవర్లు రోజంతా సంపాదించింది తినడానికే సరిపోతుంది. కానీ ఒక పూట కడుపు మాడ్చుకొని తమ పిల్లలను చిన్న చిన్న ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారు. పేదలు తమ పిల్లలకు విద్యను మాత్రమే ఆస్తిగా ఇస్తున్నారు. చాలా మంది తెలుగు మీడియంలో చదివి ఏదో ఒక స్టేజీలో ఇంగ్లీష్‌ చదవాల్సిందే. ఇంగ్లీష్‌ పికప్‌ చేసినప్పుడు రాత పరీక్షల్లో పాస్‌ అవుతున్నారు. కానీ గ్రూప్‌ డిస్కన్‌లో విఫలమవుతున్నారు. దేశంలో కలెక్టర్‌ పిల్లలకు ఏ చదువు దక్కుతుందో వారి ఇంట్లో పని చేసే పిల్లలకు కూడా అదే విద్య చదివే హక్కు దక్కుతుంది. మంత్రి ఇంట్లో పని చేసే వారి పిల్లలకు కూడా అదే విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఆ హక్కును దేశంలో మొట్ట మొదటిసారి అమలు చేసేది మన సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమే. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారు. ఇక మీదట ఈ రాష్ట్రంలో ప్రతి కూలీ, కార్మికుడు,టైలర్‌, బార్బర్‌ కుమారుడు కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవబోతున్నారు. కులం, మతం తేడా లేకుండా అందరూ ఇంగ్లీష్‌ మీడియం చదివే అవకాశం కల్పిస్తున్నారు. ఏపీ సువర్ణ అధ్యాయానికి వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇంగ్లీష్‌ మీడియం అనగానే పేదలు చదువుకోకూడదని ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. ఇంగ్లీష్‌ పేరుతో తెలుగును చంపేస్తున్నారని వితండవాదం చేస్తున్నారు. తెలుగు మన మాతృభాష, ఈ సృష్టిలో తల్లి ఉన్నంత వరకు  తెలుగు గడ్డపై తెలుగు భాష ఉంటుందన్నది మర్చిపోతున్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ వారి పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తూ తెలుగును ఉద్దరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ భయపడే వ్యక్తి కాదని వీళ్లు గుర్తించుకోవాలి. నిన్న బుచ్చయ్య చౌదరి తెలుగు భాష అంతరించిపోతుందని చెప్పారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాషా కాదు..తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుందని వీళ్ల బాధ. ఈ రోజు ఇంగ్లీష్‌ మీడియాన్ని మొదట ప్రతిపక్షం వ్యతిరేకించింది. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. తెలుగు భాషను కాపాడేందుకు అన్ని స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశారు. అది తెలుగు భాషపట్ల ముఖ్యమంత్రికి ఉన్న కమిట్‌మెంట్‌. గతంలో చంద్రబాబు సీఎంగా పని చేశారు. ఏనాడైనా తెలుగును తప్పనిసరి చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం తెచ్చింది తానే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆ రోజు నారాయణ విద్యా సంస్థల్లో మేటిరియల్‌ కోసం తెచ్చారు. వారికి రూ.17 కోట్లు చెల్లించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే అన్ని స్కూళ్లలో ఎందుకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయలేదు. వీళ్ల హయాంలో దాదాపు 4 వేలకు పైగా తెలుగు మీడియం పాఠశాలలను ఎందుకు మూత వేశారో సమాధానం చెప్పాలి. పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతుండటంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ..పిల్లలందరికీ మంచి బంగారు భవిష్యత్తు అందుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. 

Read Also: ఆంగ్ల మాధ్యమం ఓ చారిత్రక అవసరం

Back to Top