తాడేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో డొక్కా వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయకు వైయస్ జగన్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్‌ఆర్‌సీపీకి మరింత బలం: అంబటి రాంబాబు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైయస్‌ఆర్‌సీపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..డొక్కా మణిక్య వరప్రసాద్ ఈ రోజు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇది ఒక శుభపరిణామంగా భావిస్తున్నాం. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి, మాణిక్య వరప్రసాద్‌కు చాలా సత్సంభాలు ఉన్నాయి. వైయస్‌ఆర్ కేబినెట్లో వివిధ శాఖలు ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన వ్యక్తి మాణిక్య వరప్రసాద్. ఇలాంటి వ్యక్తి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఇంతకు ముందే ఆయన వైయస్‌ఆర్‌సీపీలో చేరాల్సి ఉండేది. కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఆయన చేరలేకపోయారు. రాష్ట్రంలో వైయస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇవాళ వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బడుగు, బలహీన వర్గాలకు చెందిన, నీతి, నిజాయితీ గల నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైయస్‌ఆర్‌సీపీలో చేరడం పార్టీకి బలాన్ని చేకూర్చుతుందని భావిస్తున్నాం. ఆత్మాభిమానం కలిగిన వారు టీడీపీలో ఇముడలేరు: మంత్రి ఆదిమూలపు సురేష్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాణిక్య వరప్రసాద్ టీడీపీని వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరడం శుభపరిణామం. ఆయనకు వైయస్‌ఆర్‌సీపీలో సముచిత స్థానం ఉంటుంది. ఆత్మాభిమానం కలిగిన వారు ఎవరైనా టీడీపీలో ఇముడలేరు. దళిత వర్గాలను అక్కడ చిన్న చూపు చూస్తోంది. చంద్రబాబు అనేక పర్యాయాలు దళితులను చులకనగా చూస్తూ మాట్లాడటం చూశాం. డొక్కా మాణిక్య ప్రసాదరావు టీడీపీ వీడటం ఆ పార్టీకి నష్టమే. వైయస్ జగన్ ప్రవేశపెడుతున్న ఇంగ్లీష్ మీడియానికి వరప్రసాద్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఆయన్ను వైయస్‌ఆర్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సురేష్‌బాబు పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని..: మాణిక్య వరప్రసాద్ 2014-2015లోనే వైయస్‌ఆర్‌సీపీలో చేరాల్సి ఉండేది. మా గురువు రాయపాటి సాంబశివరావుతో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాం. అక్కడ నాకు కలిసి రాలేదు. వైయస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని వైయస్‌ఆర్‌సీపీలో చేరినట్లు మాణిక్య వరప్రసాద్ తెలిపారు.