సీఎం వైయస్‌ జగన్‌తో డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధుల భేటీ

కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థ

సుమారు 2 నుంచి 3 వేల మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తాం : సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు డిక్సన్‌ టెక్నాలజీస్‌ ముందుకు రావడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ సునీల్‌ వాచని, సీఈవో పంకజ్‌ శర్మ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రతినిధులను సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. దాదాపు రెండు నుంచి మూడు వేల మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పించనున్నట్లు వారు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. 

కొప్పర్తి యూనిట్‌లో మొబైల్స్, వేరియబుల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్స్, కెమెరాలు తయారుచేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. తిరుపతి యూనిట్‌ను విస్తరించి అదనంగా 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేశామని కంపెనీ ఛైర్మన్, సీఈవోలు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. హోం అప్లయిన్సెస్‌ విభాగంలో బొష్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుని వాషింగ్‌ మెషిన్ల తయారీ యూనిట్‌ నెలకొల్పనున్నట్లు సీఎంకు తెలిపారు.  
 

Back to Top